
పోలింగ్ స్లిప్ చూపితే చాలు.. డబ్బు!
గుడివాడ: గుడివాడ మున్సిపాలిటీలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. వైఎస్‌ఆర్ సీపీ కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు మృతితో జరుగతున్న ఉప ఎన్నికలో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. 19వ వార్డు ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటుకు రూ. 7 వేలు చొప్పున డబ్బు పంచుతున్నారు. పోలింగ్ స్లిప్ చూపితే చాలు డబ్బులు అందజేస్తూ.. సాక్షి టీవీకి అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ అక్రమాలపై వైఎస్‌ఆర్ సీపీ నేతలు డీఎస్పీ అంకినీడుకు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు జిల్లా నగరపాలక కార్పొరేటర్ ఉపఎన్నికలో సైతం తెలుగు తమ్ముళ్లు ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తున్న కొంత మంది టీడీపీ నేతలను వైఎస్‌ఆర్ సీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అక్కడ నుంచి పంపించివేశారు. కాగా.. గుంటూరు జిల్లా మాచర్లలో 15 వ వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికలో పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు టెంట్ వేసుకొని ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో 12 వ వార్డుకు జరుగుతున్న పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు గూండాగిరి ప్రదర్శించారు. డబ్బులు పంచుతున్న దృశ్యాలను చిత్రీకరించిన సాక్షి టీవి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో విలేకరి సర్ఫరాజ్‌కు గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.