శ్రీబాలాత్రిపురసుందరీదేవి ఆలయం
గతంలో దేవుళ్లకు మాన్యాలు, ఆలయ నిర్మాణాలకు స్థలాలు దాతలు దానాలు చేశారు. నేటి తరంలో కొందరు పెద్దల ముసుగులో భగవంతుడికే శఠగోపం పెట్టి ఆలయ భూములు కాజేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల వద్ద వివిధ సామాజికవర్గాల వారు ఒక్కొక్క సత్రం నిర్మించుకోవడం పరిపాటి. అయితే ఒకే సామాజికవర్గానికి ఐదు సత్రాలు ఎక్కడా కనిపించవు. కానీ త్రిపురాంతకంలో మాత్రమే అదిసాధ్యమైంది. మళ్లీ మరో సత్రం నిర్మాణం కోసమంటూ కాలబైరవుడి భూమిపై కన్నేసి అధికారులపై ఒత్తిడిలు తెవడం, భూమిని సదును చేయడం విమర్శలకు తావిస్తోంది.
ప్రకాశం, త్రిపురాంతకం:ప్రభుత్వ పెద్దల అండదండలతో ఒక సామాజిక వర్గం భూ ఆక్రమణకు ప్రయత్నం చేస్తోంది. ఇది ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ఉన్న భూమి అని చెప్పినప్పటికీ వినకుండా, దేవాదాయ దర్మాదాయ శాఖ అధికారులను బెదిరింపులకు సైతం గురిచేస్తున్నారు. దాంతో అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు తహశీల్దార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
త్రిపురాంతకంలోని శ్రీబాలాత్రిపురసుందరీదేవి ఆలయం సమీపంలోని కాలబైరవుడి ఆలయానికి కొండ ప్రాంతం సర్వేనెంబర్ 702లోని 79 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ప్రైవేటు భూములు ఉండవు. ఇది చరిత్ర కలిగిన ప్రదేశమని, అత్యంత విలువైన భూమిగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఆలయాల అభివృద్ధికి దేవస్థానం మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. ఆ మాస్టర్ ప్లాన్‌లో ఈచదును చేసిన భూమి ఉంది. ఇక్కడ గతంలో రెండుసార్లు ఇతర పెద్దలు ఒక ఆశ్రమం నిర్మాణానికి ప్రయత్నం చేశారు. ఇదే విధంగా ఇక్కడ ఒక ప్రముఖ ఆలయం నిర్మాణం చేయాలని గ్రామానికి చెందిన కొందరు భక్తులు ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆలయాలకు ఈస్థలం అవసరమని చెప్పడంతో ఆప్రయత్నాలను వారు విరమించారు. కానీ ప్రస్తుతం ఆక్రమణకు యత్నిస్తున్న వారు మాత్రం మాకు అవేమీ పట్టవన్నట్లు అక్కడ భవన నిర్మాణం చేయాల్సిందే అన్నట్లు పావులుకదుపుతున్నారు.
దేవాలయ అధికారులు చెప్తున్నా.. పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టాల్సిందే అన్నరీతిలో దూకుడుగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. మాకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నయాంటూ బెదిరిస్తుండడం, అదే విధంగా అధికారులకు సైతం ఇతర డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న పెద్దలతో బెదిరింపుకాల్స్ చేయిస్తున్నట్లు పెద్ద చర్చసాగుతుంది. ఇన్‌చార్జి అధికారులు ఎంతకాలం ఉంటారు అంటూ.. విమర్శించడం చూస్తే ఇది ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఒక్క సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో ఒక్కో సత్రం ఉంది. అయితే విచిత్రంగా ఈ సామాజిక వర్గానికి ఐదు సత్రాలున్నాయి. ఇన్ని సత్రాలు ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గం నిర్వహించడం దాదాపు దేశంలో మరెక్కడ కనిపించదని భక్తులంటున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం ఉంటే ఏదైనా చేసేయొచ్చు అన్న రీతిలో కొంతమంది ఈ ఆక్రమణకు పూనుకున్నట్లు విమర్శిస్తున్నారు. దీనిపై ఒకపక్క రెవెన్యూ మంత్రి ద్వారా అధికారులకు చెప్పించడం, సిఫార్సులు చేయించడంపై ఆశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనిపై భక్తులు పెద్ద ఎత్తున విమర్శించడంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి, శ్రీపార్వతి త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయాల ట్రస్ట్‌బోర్డు వారు రెవెన్యూ అధికారులను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిని గతంలోనే మాస్టర్ ప్లాన్‌లో చేర్చినందున, దీనిని ఏ ప్రైవేటు వ్యక్తులకు అనుమతించరాదని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈప్రాంతంలో తమకూ భూములు కేటాయించాలని మిగిలిన సత్రాల వారి డిమాండ్ ముందుకు వస్తుంది. దీనిపై తహశీల్దార్ జయపాల్‌ను వివరణ కోరగా ఈ స్థలం ఆక్రమణ కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఆభూమిని దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ఉన్నందున ఆశాఖ అధికారులతో చర్చించడం జరుగుతుందన్నారు. ఆలయాల ఈఓ రమేష్‌ను ప్రశ్నించగా మాస్టర్ ప్లాన్‌లో ఉన్న విధంగా ఆలయాలకు అతి సమీపంలో ఉన్న స్థలం ఇది. దీని అవసరం ఆలయాలకు ఉంది. ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని తెలియజేశాం, రెవెన్యూ పరంగా ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. ఆలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ గోళ్ల సుబ్బారావు మాట్లాడుతూ దీనిని ఆక్రమణ జరగకుండా చూడటంతో పాటు కాలబైరవుని కొండ ప్రాంతం అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టామని దీనిని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment