టీడీపీలో మూకుమ్మడి రాజీనామాలు | TDP Leaders mass Resignations in Prakasam | Sakshi
Sakshi News home page

టీడీపీలో మూకుమ్మడి రాజీనామాలు

Published Sat, Dec 22 2018 1:45 PM | Last Updated on Sat, Dec 22 2018 1:45 PM

TDP Leaders mass Resignations in Prakasam - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఏఎంసీ మాజీ చైర్మన్‌ చెన్నారెడ్డి

ప్రకాశం,కంభం: టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందిన కంభం మండలంలోని పలువురు నాయకులు శుక్రవారం ఆ పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ నెమలిదిన్నె చెన్నారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నిజమైన కార్యకర్తలకు విలువలేదని కొత్తగా పార్టీలో చేరిన వారికి గౌరవంతో పాటు పథకాలు అందుతున్నాయన్నాయన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల అవినీతి ఎక్కువైందని గతంలో ఉన్న టీడీపీకి నేటి పార్టీకి పోలిక లేదన్నారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్లవచ్చని కానీ  గిద్దలూరు శాసన సభ్యుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. నిజమైన కార్యకర్తలు లబ్ధి పొందక పోగా అవమానాలకు గురవుతున్నారన్నారని తెలిపారు. అందుకే టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకొని.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడికి పంపిస్తున్నట్లు తెలిపారు.

అన్నారాంబాబుతో కలిసి వైఎస్సార్‌సీపీలోకి
టీడీపీకి మూకమ్మడి రాజీనామా చేసిన నాయకులంతా గిద్దలూరు మాజీ శాసనసభ్యుడు అన్నావెంకట రాంబాబుతో కలిసి శనివారం శ్రీకాకుళంలో వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరనున్నట్లు తెలిపారు. రాజీనామా చేసిన నాయకులతో పాటు మరికొందరు నాయకులు పలు వాహనాల్లో కంభం నుంచి బయలు దేరి వెళ్లారు. వీరు కూడా జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

మొత్తం ఖాళీ..
కంభం ఎంపీపీ కొత్తపల్లి జ్యోతి శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్, వైస్‌ ఎంపీపీ సంకతాల వెంకటేశ్వర్లు, మండల కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ హుస్సేన్‌బాషా, కంభం–2 ఎంపీటీసీ షేక్‌ జరీనా, కందులాపురం ఎంపీటీసీ కటికల భాస్కర్, కంభం –1 ఎంపీటీసీ సూరేప్రవీణ, చిన్నకంభం ఎంపీటీసీ గజ్జల పార్వతితో పాటు మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ నెమలిదిన్నె చెన్నారెడ్డి, మాజీ ఎంపీపీ మామిళ్ల పుల్లయ్య, మాజీ సర్పంచ్‌లు మేడూరి రాజేశ్వరరావు, కల్వకుంట మెర్సీకమలా ఆనంద్, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు బాలకోటయ్య, మాజీ కోఆప్షన్‌ సభ్యులు ఫజుల్లా రహమాన్, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు గంగారపు ఓబయ్య, జిల్లా తెలుగుయువత మాజీ కార్యదర్శి షేక్‌. జాకీర్‌ హుస్సేన్, మాజీ జన్మభూమి కమిటీ సభ్యులు, మండల పార్టీ ఉపాధ్యక్షులు, గ్రామపార్టీ అధ్యక్షులు అయిన యన్‌. చంద్రశేఖర్, రఫి, వెంకటేశ్వర్లు, గుర్రం శ్రీరాములు, యస్‌.ఎ.సత్తార్, నంద్యాల ఖాదర్‌బాష, భువనగిరి శ్రీనివాసులు, నాగార్జునరెడ్డి, దేశిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, యం.అస్లాంబేఘ్, జె. శ్రీనివాసులు, కె.రాజశేఖర్‌రెడ్డి, కె.ఇమ్మానియేలు, అంగం నాగేశ్వరరావు, మునగాల శేఖర్, సయ్యద్‌ గౌస్‌బాష రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

 టీడీపీ నుంచి 210 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలోకి చేరిక..
యర్రగొండపాలెం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీకి చెందిన కీలక నాయకులు హత్య చేయించటానికి ప్రయత్నించారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌ పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. అయితే రాష్ట్ర ప్రజల దీవెనలు ఆయనకు పునర్జన్మను ప్రసాదించాయన్నారు. శుక్రవారం స్థానిక రాజీవ్‌ అతిథి గృహం వద్ద వివిధ వర్గాలకు చెందిన 210 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టీడీపీ అధికార పార్టీ హత్యా రాజకీయాలను చేస్తోందని విమర్శించారు. అధికార పార్టీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకొని పోయిందని, జరగబోయే ఎన్నికల్లో వారిని ఆ భగవంతుడు కూడా రక్షించలేడన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానంటూ ప్రధాన వాగ్దానంచేసి గద్దెనెక్కి మరిచారని విమర్శించారు. తిరిగి అధికారంలోకి రావటానికి బాబు మళ్లీ అబద్ధపు వాగ్దానాలు చేయటానికి వెనకంజవేయడని వ్యంగ్యంగా అన్నారు.

నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిలిచి అలుపెరగని యోధుడుగా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారన్నారు. ఓట్లకోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భావజాలాన్ని ఉచ్ఛరిస్తున్న సీఎం డబ్బు మూటలు సమకూర్చి జగన్‌ చరిష్మాతో గెలుపొందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని తెలిపారు. వైఎస్సార్‌ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితులై, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తట్టుకోలేక అనేక మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటం హర్షణీయమన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు దొంతా కిరణ్‌గౌడ్, పార్టీ సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మెడబలిమి రాజశేఖర్, గౌడ సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కంచర్ల వెంకటయ్య గౌడ్, కార్యదర్శి సుందరగౌడ్, రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ జి.రంగనాయకులు, మాజీ పంచాయతీ ఉపాధ్యక్షుడు షేక్‌ మస్తాన్, వార్డు సభ్యులు షేక్‌ మహమ్మద్, జి.మస్తాన్, చెంచుసంఘం నాయకుడు డి.వీరయ్య, బీసీ సంఘం నాయకులు రాంబాబు, నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు పాలూరి శ్రీను, గిరిజన మహిళలు బొజ్జా అంకమ్మ, జంపాని కొండమ్మలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ పార్టీ కండువకప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహాత్మగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు, గౌతులచ్చన్న, వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement