
ఇసుక క్వారీలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు
తాడేపల్లి మండల పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక రీచ్‌లలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ....
► రీచ్‌లో పోటాపోటీగా భారీ యంత్రాలు
► ఫోన్లలో మాటల యుద్ధం
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మండల పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక రీచ్‌లలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తమ ఆధిపత్య పోరు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిన్న, మొన్నటిదాకా దొరికినకాడికి దోచుకుని తమ జేబులు నింపుకున్న నేతలు ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటన చేయడంతో వాటిల్లో కూడా తమ హవా కొనసాగించాలని శుక్రవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య కోల్డ్‌వార్ కొనసాగింది. వారి మధ్య వార్ జరగడంతో అధికారులు మాకెందుకొచ్చిన తిప్పలు అంటూ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
మండలంలోని గుండిమెడ, ప్రాతూరు ఇసుక రీచ్‌లను నాలుగు భాగాలుగా విభజించి మొత్తం 2.90 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు ఆ ఇసుకను తోడేందుకు అనుమతులు పొందారు.
వేరే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పెత్తనం తాడేపల్లి మండలంలో ఏంటంటూ స్థానిక నాయకులు గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఇద్దరు టీడీపీ మంత్రులతో మాట్లాడి ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు వారి పొక్లెయిన్లు కూడా కృష్ణానదిలోకి దించారు. సదరు యంత్రాలకు సంబంధించిన ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడ లేనప్పటికీ ఫోనులో మాటల యుద్ధం జరిగింది. అనుమతులు పొందిన ఎమ్మెల్యే అనుచరులు అధికారులు, పోలీసుల సహాయంతో క్వారీలోకి వచ్చిన పొక్లెయిన్లను బయటకు పంపించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రకటించినప్పటికీ నేతల మధ్య ఈ ఆధిపత్య పోరు ఎందుకు జరుగుతుందో అర్థంకాక ఇసుక వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు.