కుర్చీలు వీడరేం.. | TDP Leaders Till Not Resigning For Nominated Posts | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌ పదవులను వదలని టీడీపీ నేతలు

Published Sat, Jun 15 2019 12:36 PM | Last Updated on Sat, Jun 15 2019 12:36 PM

TDP Leaders Till Not Resigning For Nominated Posts - Sakshi

ఏలూరు (తూర్పు గోదావరి) : తొమ్మిదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండడం వల్లనో ఏమో టీడీపీ నాయకులు ఎక్కిన కుర్చీలను వదిలే పరిస్థితి కనిపించడం లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీకి సేవ చేసిన వారికి పలు నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టింది. దానిలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు నాయకులు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నామినేటెడ్‌ పదవులు పొంది వాటిలో కొనసాగుతున్నారు. అయితే చాలాకాలం అధికారంలో లేకపోవడంతో వచ్చిన ఒక్క అవకాశాన్ని ఒదులుకోలేకపోతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. 

నామినేటెడ్‌ పదవులు పొందిన వారు వీరే..
జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నాయకులు రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాస్థాయిలో నామినేటెడ్‌ పదవులు పొందారు. వారిలో రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాలి ప్రసాద్, రాష్ట్ర చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ వావిలాల సరళాదేవి, రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, బ్రాహ్మణ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ చైర్మన్‌ ఎంబీఎస్‌ శర్మ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, ఆర్టీసీ విజయవాడ జోన్‌ చైర్మన్‌ మెంటే పార్థసారథి రాష్ట్రస్థాయి పదవుల్లో కొనసాగుతున్నారు.

జిల్లా స్థాయిలోనూ అదే తీరు.
 జిల్లా స్థాయిలో కూడా టీడీపీ తనను నమ్ముకున్న వారికి అనేక నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టింది. ముఖ్యంగా జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వరరావు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ అధ్యక్షుడు భూపతిరాజు రవి వర్మలకు పదవీ కాలం ఏడాదిన్నర క్రితమే ముగిసిపోయినా ప్రభుత్వ ప్రత్యేక జీఓతో వారు ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జయ్యవరపు శ్రీరామమూర్తి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాకలపాటి గాంధీ, ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ ఉప్పాల జగదీష్‌బాబులతో పాటు మెరగాని నారాయణమ్మ, గంగిరెడ్ల మేఘలాదేవి, అత్యం నాగమణి, కర్రా రాజారావు తదితరులు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇవి కాక జిల్లాలోని వివిధ 6ఏ దేవాలయాల (రూ. కోటి పైన వార్షిక ఆదాయం వచ్చే ఆలయాలు) ట్రస్ట్‌ బోర్డులు, ఇతర ఆలయాల ట్రస్ట్‌ బోర్డులు, ఏఎంసీ చైర్మన్‌ పదవులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు సైతం తమ పదవిని విడిచిపెట్టలేకపోతున్నారు. 

తీరని పదవీకాంక్ష
సాదారణంగా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి నామినేటెడ్‌ పదవులు పొందిన నాయకులు తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే నైతిక బాధ్యత వహించి తమకు కట్టబెట్టిన పదవులకు రాజీనామా చేయడం చూస్తాం. కానీ జిల్లాలో టీడీపీ నాయకులకు మాత్రం  అటువంటి నైతిక బాధ్యతగాని, రాజ్యాంగం పట్ల గౌరవం గాని ఉన్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రస్థాయి పదవి పొందిన ఒక్క అంబికా కృష్ణ మినహా ఇతర జిల్లాస్థాయి, ఏఎంసీ, వివిధ అభివృద్ధి కమిటీల ప్రతినిధులు మినహా మిగిలిన నాయకులు మాత్రం ఇప్పటికీ తమ పార్టీయే అధికారంలో ఉందనే భ్రమలో కొనసాగుతున్నట్లు ఉన్నారంటున్నారు. ప్రభుత్వం మారి ఇన్ని రోజులైనా వారు తమ పదవీ కాంక్షతో కుర్చీలు వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరని అర్థమౌతోంది. దీనిపై పలువురు ముక్కుపై వేలేసుకుంటున్నారు. పార్టీ ఓడిపోయినా తమ పదవులను మాత్రం పదిలంగా చూసుకోవడం చూస్తుంటే పదవులపై వారి పాకులాటకు నిదర్శనంగా కనిపిస్తోందంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇటువంటి నామినేటెడ్‌ పదవులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేస్తామని ప్రకటించినా వారిలో చలనం లేకపోవడం వారి విజ్ఞతేనా అంటున్నారు. ఆర్డినెన్స్‌ జారీ చేసి పదవుల నుంచి గెంటేసే వరకూ తెచ్చుకుంటారా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement