
తమ్ముళ్లకు కల్పవృక్షం
టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నీరు చెట్టు’ పథకం ఆ పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నీరు చెట్టు’ పథకం ఆ పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గతంలో చేపట్టిన పనుల్లో టీడీపీ నేతలు పైపైనే పనులు చేసి పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేస్తున్నారు. ఉపాధిహామీ కింద పూడిక తీసిన చెరువులకు, కాలువల్లో పూడిక, గుర్రపుడెక్కలు తొలగించకనే బిల్లులు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నీరు చెట్టు పథకం కింద మంజూరైన కోట్లాది రూపాయాల పనులన్నింటినీ టెండర్లు పిలువకనే నామినేషన్ కిందే చేజిక్కించుకుని 63శాతం నిధులను టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నాయుడుపేటకు చెందిన ఓ టీడీపీ నేత అధికారులకు హుకుం జారీ చేశారు. ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మా వాళ్లకు నీరు చెట్టు పనుల్లో 75శాతం నిధులు మిగిలేలా చూడాలి’. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సొంత మండలం డక్కిలిలో 60 చెరువుల్లో ఒకే వారంలో 100 పనులు చేపట్టారు. డక్కిలి, పలుగోడు రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ చెరువు నుంచి తీసిని మట్టిని వినియోగించుకుంటున్నారు.
అయితే టీడీపీ నాయకులు కొందరు ఆ గుంతలను నీరు చెట్టు కింద చూపించి నిధులు స్వాహా చేసినట్లు ప్రచారం సాగుతోంది. కోవూరు చెరువులో మట్టిని పోలంరెడ్డి సేవాసమితి తరుపున కొందరు నాయకులు రైతులపేరు చెప్పి రూ.70 లక్షలకు అమ్మి సొమ్ముచేసుకున్నట్లు విమర్శలున్నాయి. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో కొండాపురం, కలిగిరి, వరికుంటపాడు మండలాల పరిధిలో టీడీపీ నాయకులు నీరు చెట్టు పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.