
మహనీయుల విగ్రహాలనూ వదల్లేదు..!
► శ్రుతి మించిన అధికారపార్టీ ఆగడాలు
► లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహం పసుపు మయం
► బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం మెడకు పసుపు తోరణాలు
► రెండు రోజులైనా తోరణాలు, జెండాలు తొలగించని అధికారులు
► టీడీపీ నేతల తీరుపై మండిపడుతున్న నగర ప్రజలు
సాక్షి, గుంటూరు : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు మహనీయుల విగ్రహాలనూ వదల్లేదు. అధికార మదంతో మహనీయుల విగ్రహాలకు సైతం పసుపుజెండాలు, తోరణాలు కట్టి పైశాచికానందం పొందుతున్నారు. అధికార పార్టీ నేతల ‘పచ్చ’ పాత బుద్ధిని చూసి గుంటూరు నగరవాసులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. మహనీయుల విగ్రహాలను అవమానపరిచారంటూ అధికార పార్టీ నేతలను చీత్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
మహనీయుల విగ్రహాలకు పచ్చ తోరణాలు
గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం టీడీపీకి సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. అంతర్గత విభేదాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు గుంటూరు నగరాన్ని టీడీపీ జెండాలు, పసుపు తోరణాలతో నింపేశారు. రోడ్లు, ప్రైవేటు భవనాలు, విద్యుత్ స్తంభాలు దేన్నీ వదలకుండా పసుపు మయం చేసేశారు. వీరు మరో అడుగు ముందుకు వేసి, నగరంలోని మహనీయుల విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టేశారు. ముఖ్యంగా నగరంలోని లాడ్జిసెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు జెండాలు, తోరణాలతో ముంచేశారు. అంబేద్కర్ పార్టీ వ్యక్తి కాదని, ఆయన భారత జాతి సంపదని తెలిసి కూడా ఆయనకు రాజకీయ పార్టీ జెండాలు, తోరణాలు కట్టి అవమానించడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేతల తీరుపై మండిపాటు..
టీడీపీ నేతలు ఇంతటితో ఆగకుండా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురుగా ఉన్న దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం మెడకు పసుపు తోరణాలతో ఉరివేసినట్లుగా కట్టి పడేశారు. ఈ దృశ్యాలు చూసిన నగర వాసులు టీడీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఇతర పార్టీ నేతలు ప్రైవేటు స్థలాల్లో ప్లెక్సీలు, జెండాలు వేస్తేనే ఊరుకోని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సాక్షాత్తూ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న జగజ్జీవన్‌రామ్ విగ్రహానికి పచ్చతోరణాలు కట్టినా పట్టించుకోకపోవడం శోచనీయం. రెండు రోజులు గడుస్తున్నా వాటిని తొలగించిన నాథుడే లేకుండా పోయారు. గతంలోనూ మదర్ థెరిస్సా విగ్రహానికి అడ్డుగా ఓ టీడీపీ ఎమ్మెల్యే ప్లెక్సీని కట్టడం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మరోసారి మహనీయుల విగ్రహాలకు అవమానం జరుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.