- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుల రుణ మాఫీతో సహా అన్ని హామీలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్.నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం స్థానిక కె.ఎల్‌రావు భవన్‌లో కృష్ణా-డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో ‘ రైతు రుణమాఫీ- సాగునీరు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రైతులు వ్యవసాయ రుణాలు చెల్లించద్దు.. అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పించారని గుర్తు చేశారు.
రైతు రుణమాఫీపైనే తొలి సంతకం చేస్తానంటూ రైతుల్ని, ప్రజల్ని నమ్మించారని విమర్శించారు. ఇప్పుడు రిటైర్డ్ బ్యాంకు అధికారులతో కూడిన కోటయ్య కమిటీని రుణమాఫీ కోసం వేశారని, బ్యాంకు అధికారులు రైతుల రుణమాఫీకి తగిన సూచనలు చేస్తారా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. రైతులు వ్యవసాయం కోసం తీసుకునే రుణాలన్నింటిని ప్రభుత్వం తీర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మాట్లాడుతూ కృష్ణాడెల్టాకు సాగునీరందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. రైతు సంఘం నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీని రుణాలు రీషెడ్యూల్‌గా మార్చడం సరికాదన్నారు. రైతు సంఘాల కార్యదర్శి పీఎస్‌ఆర్.దాసు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ తక్షణం చేయాలని కోరారు.
కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ సమావేశానికి అధ్యక్షత వహించి మట్లాడుతూ గతంలో జూన్ మొదటి వారంలో సాగునీరు రాకపోతే హడావిడి చేసిన దేవినేని ఉమా, నేడు రాష్ట్ర మంత్రిగా ఉండి జూలై రెండవ వారం వస్తున్నా, సాగునీరు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి వట్టివసంత కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.