మసకబారుతున్న టీడీపీ ప్రతిష్ట
ఎమ్మెల్యే ధూళిపాళ్లపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఎమ్మెల్యే ఆలపాటిపై చీటింగ్ కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఇంకా పలు అక్రమాల్లో పలువురు ఎమ్మెల్యేలు
సీఎం ప్రకటనలకు భిన్నంగా జిల్లాలో పరిస్థితులు
విస్మయానికి గురవుతున్న తెలుగుతమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు పోలీస్ కేసులు నమోదు వరకు వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలు సెటిల్‌మెంట్లు, దందాలు, భూ కబ్జాలు, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నా అధికారులు ప్రశ్నించే సాహసం చేయడం లేదు. హద్దుమీరి వ్యవహరించిన ఇద్దరు ఎమ్మెల్యేలపై బాధితులు తిరుగుబాటు చేయడంతో పోలీస్, న్యాయ విభాగాలు కల్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై పోలీసులు కేసు నమోదు చేస్తే, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు పోలీసు కేసుల్లో చిక్కుకున్నారు. మరి కొందరిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. అవినీతి, అక్రమాలను సహించనని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా జిల్లాలో పరిస్థితులు ఉండటంతో పార్టీ శ్రేణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
పొన్నూరు మండలం చింతలపూడి సొసైటీ సీఈఓగా పనిచేసిన కూచిపూడి గాంధీ ఆత్మహత్యకు ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రధాన కారకులనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. తనకు అనుకూలంగా ఉండే సొసైటీ ఉద్యోగులను కూచిపూడి గాంధీపై ఎగదోసి మానసికంగా ఒత్తిడికి గురయ్యే విధంగా చేశారని, మరో మార్గం లేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని గాంధీ భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ప్రాథమిక దర్యాప్తు ఆధారం చేసుకుని రైల్వే పోలీసులు సెక్షన్ 306తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సొసైటీలో అక్రమాలు జరిగి ఉంటే ఎమ్మెల్యేగా సమస్యను పరిష్కరించాలని, లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా రాజకీయ విభేదాలను దృష్టిలో ఉంచుకుని వేధించారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజాపై అనేక ఆరోపణలు లేకపోలేదు. వాటిపై అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో ఏవీ పోలీస్ స్టేషన్ వరకు రాలేదు. బుధవారం అనూహ్యంగా ఫోర్జరీ కేసు వెలుగులోకి వచ్చింది. కళాశాల అనుమతికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారనే అంశంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మేడ్చల్ కోర్టు జీడిమెట్ల పోలీసులను ఆదేశించింది. 420, 468, 471, 472 సెక్షన్లు నమోదు చేయాలని పేర్కొంది.
నియోజకవర్గంలోనూ ఈ తరహా వ్యవహారాలు లేకపోలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా కర్లపాలెం, బాపట్ల, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలోని సముద్ర జనిత ఇసుకను క్యూబిక్ మీటర్ రూ.50 చెల్లించి తరలించవచ్చని జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే సుమారు రెండు నెలల క్రితం ఆదేశాలు ఇస్తే, డిపీవో వీరయ్య చౌదరిపై ఒత్తిడి తెచ్చి కొల్లిపర, కొల్లూరు మండలాలను కలెక్టర్ ఇచ్చిన జాబితాలో జత చేయించి ఇసుక అక్రమ దందా కొనసాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
నెల రోజులకు ఈ విషయం బయటకు పొక్కడంతో డీపీవోను కలెక్టర్ మందలించి కొల్లిపర, కొల్లూరు మండలాలను ఆ జాబితా నుంచి తొలగించారు. ఈ దందాలో ఎమ్మెల్యే బాగానే సంపాదించారని స్వపక్షం నేతలే చెబుతున్నారు. అధికార యంత్రాంగం వైఫల్యం కూడా వీరి విచ్చలవిడితనానికి కారణమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.