ముగ్గురూ.. ముగ్గురే
- టీడీపీ సర్వేలో ఎమ్మెల్యేల మీద జనం అసంతృప్తి
- కోవూరు, వెంకటగిరి ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు
- ఉదయగిరి ఎమ్మెల్యే అందుబాటులో లేడని ప్రజల ఆగ్రహం
- ముగ్గురి తీరుపై సీఎం చంద్రబాబు అసహనం
- వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ రెండేళ్లలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా చేసే ప్రతి పని తామే చేయాలని పట్టుబట్టడం, ఇతర కాంట్రాక్టర్లను బెదిరించడం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నుంచి పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న కేడర్‌కు చిన్న పనులు కూడా ఇవ్వడం లేదు. ఆయన అభిప్రాయాలను అంగీకరించని పార్టీ నాయకులు, మాట వినని అధికారులతో ఆయన వ్యహరిస్తున్న తీరుపై జనం అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుని పోలేక పోతున్నారు.
నిధులు.. గోవిందా
- కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నియోజక వర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో నేరుగా వాటాలు తీసుకుంటున్నారు. నియోజక వర్గంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిధులు కొల్లగొట్టారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కూడా కమీషన్లు లేనిదే పనులు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ పనిచేయాలంటే భయపడుతున్నారు. ప్రజలకు దగ్గర కాలేక పోతున్నారు. ప్రభుత్వ, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని పోలేకపోతున్నారు.
రామా.. రావు
- ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు జనానికి అందుబాటులోనే ఉండటం లేదు. నియోజక వర్గంలోని చాలా మంది ప్రజలు ఆయనను ఇప్పటి దాకా చూడనే లేదు. ఆయన తరఫున ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చూస్తున్న నాయకులు ఎవరికి వారు సొంత వ్యాపారాల్లో మునిగిపోయారు. ఎమ్మెల్యే పేరు చెప్పి చోటా నాయకులు కాంట్రాక్టర్ల నుంచి బలవంతంగా పర్సెంటేజీలు పిండేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని వెళ్లలేక పోతున్నారు. నియోజక వర్గంలో ఏవైనా సమస్యలు వస్తే ప్రజలు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి దగ్గరకు వెళుతున్నారు.