టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసు | TDP MP Murali Mohan, others booked in Hyderabad | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎంపీ మురళీమోహన్‌పై కేసు

Published Fri, Apr 5 2019 1:33 AM | Last Updated on Fri, Apr 5 2019 10:20 AM

TDP MP Murali Mohan, others booked in Hyderabad - Sakshi

స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టలను చూపుతున్న సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ (ఇన్‌సెట్‌)లో నిందితులు శ్రీహరి, పండరి   

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేత, ఎంపీ మురళీమోహన్‌పై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం పోలీసుల తనిఖీల్లో దొరికిన రూ.2 కోట్లకు సంబంధించి మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. గచ్చిబౌలి జయభేరి కార్యాల యం నుంచి రెండు బ్యాగుల్లో డబ్బులతో ఆటో లో హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలో దిగి ఇద్దరు వెళ్తుండగా  పోలీసులు తనిఖీ చేయగా దొరికిపోయారని తెలిపా రు. జయభేరి ఉద్యోగులు కాకినాడ వాసి నిమ్మాలూరి శ్రీహరి, మెదక్‌ జిల్లా వాసి అవుటు పండారీలను అదుపులోకి తీసుకుని విచారించగా రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు అంగీకరించినట్లు చెప్పారు. 

రైలు మార్గం ద్వారా రాజమండ్రికి.. 
జయభేరి ప్రాపర్టీస్‌కి చెందిన ధర్మరాజు, జగన్‌ మోహన్‌రావు ఆదేశాల మేరకు అదే కార్యాలయంలో ఆఫీసు అసిస్టెంట్‌లుగా పనిచేసే శ్రీహరి, పండారీలు రెండు బ్యాగుల్లో రూ.2 కోట్లు తీసుకుని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. కారులో వెళ్తే తనిఖీలు చేస్తారనే ఉద్దేశంతో ఆటోలో వెళ్లారు. ఇటీవల రాజేంద్రనగర్‌లోని ఆరామ్‌ఘర్‌ వద్ద బస్సులో ఏపీ టీడీపీ నేత పరిటాల సునీత అనుచరులు రూ.28 లక్షలు తీసుకెళ్తూ పోలీసులకు దొరికారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని భావించి అన్ని రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు, మాదాపూర్‌ పోలీసులు బుధవారం తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించారు. హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఆటో దిగి ఆదరాబాదరాగా వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో రూ.రెండు కోట్లు దొరికాయి. తాము జయభేరి ప్రాపర్టీ ఉద్యోగులమని వారు చెప్పినట్లు సమాచారం. 

కోడలు గెలుపు కోసం.. 
హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి ఎంఎంటీఎస్‌లో సికింద్రాబాద్‌కు చేరుకొని, అక్కడి నుంచి గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళ్లాలని ధర్మరాజు, జగన్‌మోహన్‌రావు సూచించినట్లు ఇద్దరు నిందితులు శ్రీహరి, పండారీలు పోలీసు విచారణలో అంగీకరించారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే మురళీమోహన్‌ అనుచరుడు యలమంచి మురళీకృష్ణ కలుస్తాడని, తర్వాత ఆ డబ్బును రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌కు ఇవ్వాలని ఆదేశించినట్లు వారు వెల్లడించారని చెప్పారు. ఈ డబ్బునే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరఫు అభ్యర్థి మురళీమోహన్‌ కోడలు రూప.. నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరు ఇచ్చిన వాంగ్మూలంతో ఎంపీ మురళీమోహన్, యలమంచి మురళీకృష్ణ, ధర్మరాజు, జగన్‌మోహన్‌రావులపై ఐపీసీ సెక్షన్‌ 171(బి), 171(సి), 171(ఈ),171(ఎఫ్‌)ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ డబ్బును ఐటీ విభాగానికి అప్పగిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement