వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు కుదురుతుందనే ఊహాగానాల నేపథ్యంలో జిల్లా భారతీయ జనతా పార్టీలోనూ రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు కుదురుతుందనే ఊహాగానాల నేపథ్యంలో జిల్లా భారతీయ జనతా పార్టీలోనూ రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. పొత్తుల్లో భాగంగా జిల్లాలో ఒకటి లేదా రెండు స్థానాలు బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒక్క స్థానమైతే కచ్చితమనే
అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది. పొత్తంటూ ఉన్నట్టుయితే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చనే భావన పార్టీ ముఖ్యుల్లో ఉంది. రెండు స్థానాలు ఇచ్చినట్టయితే కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఒకటి కోరవచ్చని అంటున్నారు. ఆ మేరకు ఆయా నియోజకవర్గాల నాయకుల్లో ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. బీజేపీతో చెలిమి ఉన్నట్టయితే ఒక స్థానం ఆ పార్టీకి వదులుకోవాల్సిందేనని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. దీంతో బీజేపీ పోటీకి అవకాశాలు ఉన్న స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే విషయమై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
ప్రధానంగా ఆ పార్టీ గురిపెట్టిన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన స్వగ్రామం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటంతో పాటు గతంలో పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండటంతో బలమైన అభ్యర్థి అవుతారనే ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీకి అంతగా పట్టు లేనప్పటికీ తెలుగుదేశం సహకారంతో సన్నపురెడ్డి మంచి అభ్యర్థి అవుతారని చెబుతున్నారు. భారతీయ జనతాపార్టీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు స్వగ్రామం కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నందున సర్వేపల్లిపై ఆ పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. 1994లో ఒకసారి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అప్పట్లో అన్నం శ్రీనివాసులు ఇక్కడ నుంచి పోటీ చేసినప్పటికి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
జిల్లాకు రెండు స్థానాలు దక్కినట్టయితే బీసీ అభ్యర్థులను రంగంలోకి తీసుకురావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాల్లో ఒక చోట బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ రావచ్చని అంటున్నారు. 2004 ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేసిన సమయంలో నెల్లూరుతో పాటు ఆత్మకూరు కూడా బీజేపీకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులకు పరాజయం ఎదురయ్యింది. టీడీపీ ఓటు బ్యాంకుతో పాటు మోడి ఆకర్షణపై ఆశలు పెట్టుకున్న జిల్లా బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే తహతహలాడుతోంది.