గుంటూరు, న్యూస్‌లైన్: అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజనకు తొలి సంతకం చేస్తామని చెబుతున్న బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు సమైక్యాంధ్రకు మద్దతిస్తామని ఆ పార్టీతో ఏకగీవ్ర తీర్మానం చేయించాలని రాష్ర్ట రెవెన్యూ శాఖ రాష్ర్ట మంత్రి ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసినా రాష్ర్ట విభజన జరగదని రఘువీరారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ పార్టీ తీర్మానం ఇచ్చిన చంద్రబాబు నేడు ఏ గడ్డపై ఆగడ్డ మాట మాట్లాడుతున్నారన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను చంపమీద కొట్టాలని వ్యాఖ్యానించడం సరికాదని దిగ్విజయ్‌కు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. జగన్ డీఎన్‌ఏ కాంగ్రెస్‌దే అనడంలో తప్పులేదన్నారు. చంద్రబాబు సైతం ఒకప్పుడు తనలో 30 శాతం కాంగ్రెస్ పార్టీ రక్తం ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
వైఎస్ ఫొటోతో ఉద్యమం సరికాదు...
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2009 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బహిరంగానే అన్నారని, అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వైఎస్ ఫొటో పెట్టుకుని జగన్ సమైక్యాంధ్ర ఉద్యమం చేయటం ఏ మేరకు భావ్యమో చెప్పాలన్నారు. వెంటనే వైఎస్ ఫొటో తీసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. విజయమ్మ సమన్యాయం చేయాలని దీక్ష చేస్తే, జగన్ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్నారని, అసలు వైఎస్సార్ సీపీ వైఖరేమిటే స్పష్టం చేయాలని కోరారు. తాము రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని అధిష్టానం వద్ద అనుమతి తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు.
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతోంది
Published Mon, Dec 16 2013 1:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement