ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ
జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
సైదాపురం: ప్రజాస్వామ్యాన్ని అధికార టీడీపీ ఖూనీ చేస్తోందని జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆరోపించారు. మండలంలోని చాగణంలో శనివారం నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే పొంది అసెం బ్లీకి వస్తుంటే మార్షల్స్ అడ్డుకోవడం దారుణమన్నారు.
కోర్టు తీర్పుకంటే తామే సుప్రీంగా స్పీకర్, ముఖ్యమంత్రి ప్రవర్తించడం శోచనీయమన్నారు. అసెంబ్లీలో అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎమ్మెల్యే రోజా విషయంలో కూడా అదేవిధంగా వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నిం చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కోర్టుతో పాటు, ప్రజలు చూస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో అధికార పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ వ్యవహారం
అసెంబ్లీలో స్పీకర్ సభా నిబంధనలకు వ్యతిరేకంగా వ్య వహిస్తున్నారని జెడ్పీ చైర్మన్ అన్నారు. తమ పార్టీకి చెం దిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కొనుగొలు చేసి, టీడీపీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా స్పీకర్ కాపాడారన్నారు. దీంతో వెంటనే స్పీకర్‌పై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిందన్నారు. నిబంధనల ప్రకారం నోటీ సు ఇచ్చిన 14 రోజుల తరువాతనే నిర్ణయం తీసుకోవాలని చట్టం చెబుతోందన్నారు.
అదీ కూడా అధికారపార్టీకి అనుకూలంగా వచ్చేలా స్పీకర్ వ్యవహరించారన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంపై స్పీకర్ కక్ష కట్టుకుని వ్యవహరిస్తున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టుధిక్కారణ పిటిషన్ వేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చెంచుకృష్ణారెడ్డి, శ్రీనివాసులుయాదవ్, శేఖర్‌నాయుడు, శ్రీనివాసులునాయుడు, జాజుల శ్రీనివాసులు, వెంకటసుబ్బరాజు, వెంకటసుబ్బారెడ్డి, గంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.