ఈ 3 నెలల్లో జరిగిన వాటికీ వైఎస్‌దే బాధ్యతంటారా?
అధికార పార్టీ తీరుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించినా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆయన భయం వదిలినట్టు లేదు. వైఎస్ మరణించి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయన్ని అకారణంగా తప్పుబట్టడం టీడీపీకి అలవాటుగా మారిందనేది సోమవారం అసెంబ్లీలో మరోసారి రుజువైంది. నకిలీ మద్యం కేసులపై చర్చ సందర్భంగా అధికార టీడీపీ సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరును ప్రస్తావిస్తూ విమర్శలకు దిగారు. దీనికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు.
‘‘రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్‌దే బాధ్యతా?! ఆయన (వైఎస్) చనిపోయి ఎన్నేళ్లైంది..? ఐదేళ్లు దాటింది..! ఎన్నికలు జరిగి ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కావొస్తోంది.. అయినా వైఎస్‌ని వీళ్లు వదలడం లేదు. ప్రతి దానినీ ఆయనకు ఆపాదించడం వీళ్లకు అలవాటైపోయింది’’ అని ఆక్షేపించారు. ‘‘టీడీపీ వాళ్ల తీరు చూస్తుంటే ఈ మూడు నెలల్లో జరిగిన వాటికీ వైఎస్‌నే బాధ్యుణ్ణి చేయాలన్నట్లుంది. అలాచేయటం టీడీపీకే చెల్లుతుంది.. నిజంగా.. టీడీపీ సభ్యులకే ఆ ఘనత దక్కుతుందేమో’’ అని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పాలకపక్షం కూర్చున్న వైపు చూస్తూ వారికి ఒక నమస్కారం చేశారు.