
బాబు దర్శనం కోసం నిరీక్షణ
నిరాశగా వెనుదిరిగిన కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దర్శనం కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పడిగాపులు గాయాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశం వాయిదా పడ్డాక చంద్రబాబు మధ్యాహ్నం రెండున్నరకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఆయన నేరుగా సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డులను లింక్ చేసే అంశంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అయన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు. దీంతో ప్రతి రోజూ నిర్వహించే జనరల్ విజిట్ కార్యక్రమాన్ని రద్దు చేశామంటూ అక్కడకు వచ్చిన ప్రజలను అధికారులు వెనక్కి పంపేశారు. వైద్య సహయంకోసం వచ్చిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి 20 రోజుల్లో మీ ఇంటికి లెటర్ వస్తుందని చెప్పి పంపించారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, ఎస్‌పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సీనియర్ నాయకులు టిడి జనార్దనరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, ఎల్వీఎస్సార్కే ప్రసాద్‌లు చంద్రబాబును కలిశారు.
వైద్యసాయం కోసం వచ్చిన వారితో పాటు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు సీఎం క్యాంపు కార్యాలయంలో కొద్ది రోజులుగా నిరీక్షణ తప్పడంలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్నికల్లో టికెట్లు దొరకని, అవకాశం రాని వారంతా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. దరఖాస్తులను పార్టీ అధినేతకు సమర్పించేందుకు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు తమ్ముళ్లు సైతం నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. చిత్తూరు, గుంటూరు, అనంతపురం,కర్నూలు తదితర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు దరఖాస్తు చేసుకునేందుకు లేక్‌వ్యూ అతిథిగృహానికి వచ్చారు. వారెవరికీ చంద్రబాబు దర్శనం దొరకలేదు. శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కలుసుకోవాల్సిందిగా సిఎం వ్యక్తిగత సిబ్బంది వారికి సూచించారు. దీంతో కార్యకర్తలు ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది.