సాక్షి, అమరావతి: ఏపీలో ఎన్నికల హామీల అమలులో కూటమి సర్కార్ మరోసారి విఫలమైంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ యూటర్న్ తీసుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం పథకం ఉండదని స్వయంగా మంత్రి నారా లోకేష్ సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమలులోకి తీసుకోస్తామన్నారు.
కాగా, ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో తల్లికి వందనంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు సరిగా జరగలేదు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరలేదు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చేరలేదో సమీక్ష చేయాలి. అలాగే, తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుపరుస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మందికి ఇవ్వడంపై చర్చించాల్సి ఉంది. తల్లిదండ్రులు, మేధావులతో చర్చించి ఈ పథకాన్ని అమలుపరుస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై దొంగాట ఆడుతోంది. ఇందుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 29లో ‘ఈచ్ మదర్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని బొంకుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ప్రతి బిడ్డకు, ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ తలో రూ.15 వేలు చొప్పున ఇస్తామని గానీ, మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఇస్తామని గానీ చెప్పడం లేదు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ముందుకునెట్టి ఈ పథకంపై ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని చెప్పించి.. చేయబోయే మోసంపై దాటవేత ధోరణి అవలంబించారు.
Comments
Please login to add a commentAdd a comment