అమరావతి, సాక్షి: కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది.
స్పీకర్‌గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో.. రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.
ఇదీ చదవండి: ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో ట్విస్ట్ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మంత్రి పదవులు తక్కువగా ఇచ్చారు చంద్రబాబు. దీంతో.. డిప్యూటీ స్పీకర్ ఇవ్వొచ్చని తొలి నుంచి ప్రచారం నడిచింది. ఈ క్రమంలో జనసేన తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి కూడా. అయితే..
స్పీకర్ పదవి విషయంలో జనసేనకు మొండి చేయి దక్కవచ్చనేది లేటెస్ట్ టాక్. డిప్యూటీ స్పీకర్ పదవిని మరో మిత్రపక్షం బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి(బాబు అనుచరుడు కూడా) పేరు ఫైనల్ కావొచ్చని తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేనకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చినా.. పవన్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వడం, అదే సమయంలో బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు ఈమేర ఆలోచన చేస్తున్నారన్నది తాజా ప్రచార సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment