కుక్క రూపంలో ఎదురైన మృత్యువు...
కుమరాం (జామి): పాఠశాలకు వెళుతున్న ఓ ఉపాధ్యాయినికి కుక్క రూపంలో మృత్యువు ఎదురైంది. బైక్‌పై నుంచి జారిపడి ఆమె మరణించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం లక్ష్మి (38) బొండపల్లి మండలం గరుడబిల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా పుట్టింటివారు ఉంటున్న జామి నుంచి పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. ఎప్పట్లానే శుక్రవారం పాఠశాలకు బయలుదేరారు. గరుడబిల్లి వెళ్లే బస్సు తప్పిపోవటంతో ఎస్.కోట నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగారు.
ఆయనతో కలిసి బైక్‌పై వెళుతుండగా కుమరాం జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా బ్రేకు వెయ్యడంతో వెనక కూర్చున లక్ష్మి కింద పడిపోయారు. తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మరణించారు. స్థానికులు 108కి, పోలీసులకు సమాచారమందించారు. 108 సిబ్బంది వచ్చి లక్ష్మి మరణించినట్టు ధ్రువీకరించారు. సంఘటన జరిగిన ప్రదేశం విజయగనరం రూరల్, జామి పోలీస్ స్టేషన్లకు హద్దు కావడంతో జామి ఇన్‌చార్జి ఎస్సై సాగర్‌బాబు, విజయనగరం రూరల్ ఎస్.ఐ. కృష్ణమూర్తి చేరుకున్నారు.
ఎవరి పరిధన్నది తేలకపోవడంతో మృతదేహన్ని ఆస్పత్రికి తరలించటంలో జాప్యం జరిగింది. సంఘటన స్థలి జామి పరిధిలోకి వస్తుందని రెవెన్యూ అధికారులు నిర్ధారించాక మృతదేహన్ని విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రంగారావు పెదమానాపురం జెడ్‌పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె లావణ్య ఇంటర్ సెకండియర్, కుమారుడు కార్తీక్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. 2002లో ఉపాధ్యాయినిగా విధుల్లో చేరిన లక్ష్మి కొంతకాలంగా జామిలో నివాసం ఉంటున్న తండ్రి తాతారావు వద్ద ఉంటూ పాఠశాలకు వెళ్లివస్తున్నారు.
ఇంటికెళ్లిపోదాం.. రామ్మా..
సంఘటన స్థలికి వచ్చిన పిల్లలు లావణ్య, కార్తీక్‌లు తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్లిపోదాం... రామ్మా.. అంటూ వారు రోదించిన తీరు చూసి స్థానికులు కంటతడిపెట్టారు. పాఠశాలకు బయలుదేరిన కొద్దిసేపటికే కుమార్తె మృతి వార్త తెలియటంతో తండ్రి తాతారావు షాక్ తిన్నారు. సంఘటన స్థలి వద్ద నిస్సహాయంగా కూలబడిపోయారు.