సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ల సందడి మొదలవడంతో అభ్యర్థులు వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యారు. రెండు జిల్లాల్లో కలిపి 21,899 మంది ఓటర్లు ఉండగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 12,654 మంది, పశ్చిమగోదావరిలో 9,245 మంది ఉన్నారు. ఉపాధ్యాయులే ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ది కీలక పాత్ర కానుంది. శాసనమండలిపునరుద్ధరణ తర్వాత జరిగిన రెండు ఎన్నికలూ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.
ఉపాధ్యాయ సంఘాల్లో యూటీఎఫ్, ఎస్‌టీయూ బలాబలాలు నువ్వా, నేనా అన్నట్టుగా ఉన్నాయి. ఫలితంగా ఈ రెండు సంఘాలకు అభ్యర్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకా పీఈటీ, పీఆర్‌టీయూ, ఎస్‌టీఎఫ్ తదితర సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. శాసనమండలిని పునరుద్ధరించిన తరువాత రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ హ వా కొనసాగటంతో ఉపాధ్యాయ వర్గాల ఆలోచనలు కూడా అటువైపే మళ్లాయి. ఉపాధ్యాయుల్లో కొందరు పగలు పాఠాలు చెబుతూ రాత్రి అభ్యర్థులకు గోప్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనంటున్నారు.
ఎన్నికల నాటికి సంఘాల్లో చీలికలు!
సంఘాల ప్రతినిధులు మాట ఇచ్చినా సంఘంలోని ఉపాధ్యాయులంతా ఏకతాటిపై నిలుస్తారనే నమ్మకం కలగకపోవడంతో అభ్యర్థులు మల్లగుల్లాలుపడుతున్నారు. మద్దతు విషయంలో ఒకే సంఘంలోని నాయకుల నుంచి పరస్పర విరుద్ధంగా ప్రకటనలు వస్తుండటంతో మాట తీసుకున్న అభ్యర్థులు కలవరానికి గురవుతున్నారు. ఈ పరిణామాలు ఎన్నికలు సమీపించేసరికి ఉపాధ్యాయ సంఘాల మధ్య చీలికకు దారితీయొచ్చంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు, యూటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు, పార్టీ రహితంగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు గొల్ల బాబూరావు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.
వీరితో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్ బలపరిచిన అభ్యర్థిగా పిల్లి డేవిడ్‌కుమార్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలా బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఎవరి స్థాయిలో వారు పగటి పూట ప్రచారంలో బిజీగా ఉంటూ రాత్రయ్యేసరికి తెరవెనుక ఎత్తులపై కసరత్తు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు. ఒకపక్క ప్రచారం చేసుకుంటూ పోతున్న కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలు ఆ వెనుకనే తమ అనుచరులు, సన్నిహితుల ద్వారా ఉపాధ్యాయ సంఘాల ప్రాబల్యం, కలిసివచ్చే స్థానికత, ఆర్థిక అంశాలు ప్రామాణికంగా లెక్కలు తీస్తున్నారు.
నామినేషన్ బోణీ..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు తొలిరోజైన గురువారం బోణీ అయింది. అమావాస్య ఉదయం ఆరుగంటలకే వెళ్లిపోవడంతో పిఠాపురానికి చెందిన న్యాయవాది పేపకాయల రాజేంద్ర కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ప్రధాన అభ్యర్థులు పండితులతో సంప్రదించి నామినేషన్‌ల దాఖలుకు ముహూర్తాలను నిర్ణయించుకునే పనిలో ఉన్నారు. టీడీపీ మద్దతు కోసం ప్రయత్నించి విఫలమై బరిలో నిలిచిన ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు ఈ నెల 25న మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్‌ల దాఖలు తదితర వివరాలు తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో యాదగిరిని కలిసేందుకు వచ్చిన సందర్బంగా కృష్ణారావు ఈ విషయాన్ని ‘సాక్షి’కి ధృవీకరించారు. యూటీఎఫ్ అభ్యర్థిగా పశ్చిమగోదావరికి చెందిన రాము సూర్యారావు ఈ నెల 24న నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా ముహూర్తం విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ చైతన్యరాజు ముహూర్తం కోసం పండితులతో సంప్రదిస్తున్నారు.
వ్యూహం..ప్రతి వ్యూహం...
Published Fri, Feb 20 2015 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement