
విమాన సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ఎయిరిండియా సిబ్బంది విమాన ప్రయాణికులకు నరకం చూపించారు. విమానం మొరాయించడంతో ఉదయం నుంచి పడిగాపులు పడ్డారు. విశాఖ విమానాశ్రయంలో గురువారం ఉదయం 7.50 గంటలకు 180 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రన్‌వే నుంచి కదులుతూ ఎరరడానికి సిద్ధమయ్యే సరికి సమస్యను పైలెట్ గుర్తించి విమానాన్ని తిరిగి అప్రాన్‌పైకి తీసుకొచ్చేశారు. ప్రయాణికులందర్నీ దించేసి టెర్మినల్ బిల్డింగ్‌లోకి పంపారు. మరో విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. అలా కుదరదని విమాన సంస్ధ ఉద్యోగులు బదులివ్వడం, గంటల తరబడి టెర్మినల్ బిల్డింగ్‌లో ఉంచేయడంతో ప్రయాణికులు టిఫిన్లు, భోజనాలు లేక అల్లాడిపోయారు. తాను పొరుగుదేశానికి అత్యవసరంగా వెళ్లాలని విదేశీ ప్రయాణికురాలు వత్తిడి తెచ్చినా ఢిల్లీకి ఇంకో విమానంలో పంపలేమని, రీబుకింగ్ చేసుకోవాల్సిందేనని సెలవిచ్చారు.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిరిండియా కూడా ప్రత్యామ్నాయం చూపక పోతే ఎలా అని ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. అయినా ఎయిరిండియా నిర్వాహకులు స్పందించలేదు. కొందరు ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను వెతుక్కుని గమ్యాలకు వెళ్లిపోయినా మిగతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. రాత్రి తొమ్మిదిన్నరకు విమానం కదులుతుందని విమానవర్గాలు చెప్పినా రాత్రి పన్నెండయినా విమానం కదల్లేదు. పదకొండు గంటలకు అధికారులు కూడా ఇక్కడి నుంచి ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ విదేశీయులు, పిల్లలతో మరి కొందరు తల్లులు నానా యాతనపడిపోయారు. కనీసం భోజన సదుపాయాల్లేకుండా పట్టించుకోకుండా ఇలా హింస పెట్టడమేంటని ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. కనెక్టివిటీ ఫ్లెయిట్ మిస్ అవుతామని విదేశీ ప్రయాణిలు ఆందోళన చెందారు.
ఎయిరిండియా పరువు పోయింది
ప్రభుత్వ రంగ సంస్థగా ఎయిరిండియా పరువు పోయింది. ఇంత దారుణం ఎపుడూ చూడలేదు. విమానం మొరాయించాక ప్రత్యామ్నాయం చూపనప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఏమిటని ఉన్నతాధికారులు పట్టించుకోపోతే ఎలా. ఇదేనా బాధ్యత. ప్రత్యామ్నాయం అడిగితే ఇంకో టికెట్ తీసుకోవాలని చెప్పారు.
– డాక్టర్ డీవీఏఎస్‌వర్మ, చైనా ప్రయాణికుడు
దుర్మార్గంగా వ్యవహరించారు
ఢిల్లీలో ఆలిండియా ప్రభుత్వ రంగ పర్యవేక్షణ కోరుతూ కార్మిక సంఘాలతో జంతర్‌మంతర్ వద్ధ «ధర్నా చేయాలని మూడునెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్నాం. గురువారమే చేరుకోవాల్సి ఉంది.
– రవీంద్రబాబు, బీహెచ్‌ఎల్ కార్మికనేత