
తెలంగాణ బంద్ విజయవంతం : కోదండరామ్
హైదరాబాద్: ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ బంద్ 100 శాతం విజయవంతమయిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. 500 మందికి పైగా తెలంగాణావాదులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిజాం కాలేజ్‌లో 200మందిని అరెస్ట్ చేసి గోషామహల్‌కు తరలించినట్లు
తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ఓయూ యూనివర్శిటీ లోపలికి పోలీసులు ప్రవేశించారని తెలిపారు. లాఠీఛార్జీలు, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్య ముసుగులో సీమాంధ్ర పాలకులు, సీఎం నేతృత్వంలో చేసే కుట్రలను తిప్పికొడదామని పిలుపు ఇచ్చారు. గాయపడిన వారందరికి ప్రభుత్వమే వైద్య సాయం అందించాలని డిమాండ్ చేశారు. నిజాం హాస్టల్ పైనుండి విద్యార్ధి దూకితే కాలు విరిగినా ఆంబులెన్స్‌ను పిలవలేదని మండిపడ్డారు. మరో రెండు మూడు రోజుల్లో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని కోదండరామ్ చెప్పారు.