తెలంగాణలో బోనాల పండగకు ఓ ప్రత్యేకత ఉంది. బోనంకుండలో అమ్మవారికి తమ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించే ఘట్టాన్ని బోనాలుగా వ్యవహరిస్తారు. మహిళలు ఉదయాన్నే తలస్నానం చేసి మడితో మొక్కు ప్రకారం బోనం ప్రసాదాన్ని తయారు చేస్తారు
ఆలేరు, న్యూస్‌లైన్: తెలంగాణలో బోనాల పండగకు ఓ ప్రత్యేకత ఉంది. బోనంకుండలో అమ్మవారికి తమ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించే ఘట్టాన్ని బోనాలుగా వ్యవహరిస్తారు. మహిళలు ఉదయాన్నే తలస్నానం చేసి మడితో మొక్కు ప్రకారం బోనం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రసాదం ఉన్న పాత్రను అపవిత్రం కాకుండా చూస్తారు. అమ్మవారికి సమర్పించేందుకు వెళ్లే సమయంలో బోనంకుండపై దీపాన్ని వెలిగించి తలపై పెట్టుకొని డప్పుల దరువు..పోతురాజుల విన్యాసాలతో ప్రదర్శనగా గుడి దగ్గరికి వెళ్తారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. కాళ్లకు పారాణి రాసుకుని తడి వస్త్రాలతో ఆలయాలకు రావడం ఆచారంగా భావిస్తారు.
నైవేద్యం
ఉత్సవాల్లో అత్యంత కీలకమైనది బోనం. ఇది భోజనం అన్న పదానికి రూపాంతరంగా వచ్చిందని పండితులు చెబుతారు. ఇత్తడి, రాగి, మట్టి కాని మిశ్రమ లోహాలతో రూపొందించిన పాత్రకు సున్నం, జాజు, పసుపు, కుంకుమలతో బొట్లు పెడతారు. వేప కొమ్మలతో అలంకరిస్తారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన పదార్థాలతో రూపొందించిన పరమాన్నాన్ని నైవేద్యంగా ఉంచుతారు. తమకు మంచి జరగాలని, వర్షాలు కురిసి గ్రామసీమలు పంటలతో కళకళలాడాలని అక్కడ వారు కోరుకుంటారు. బోనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
ముస్తాబవుతున్న ఆలయాలు
జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలను సుందరంగా తీర్చిదిద్ది విద్యుద్దీపాలంకరణ చేస్తున్నారు. ఆలయాల వద్ద భక్తి, జానపద పాటలు వేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు తొలి పండగ కావడంతో దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు.
వేపాకు పాత్ర
బోనంలో వేపాకు పాత్ర ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. బోనాన్ని అమ్మవారికి సమర్పించే వారు పసుపు నీళ్లలోని ఓ పాత్రలో వేపకొమ్మలు ఉంచుతారు. దేవత కొలువుదీరిన ప్రదేశానికి ఎదురుగా ఆ నీటిని సమర్పిస్తారు. దాన్ని శాక అని వ్యవహరిస్తారు. నీరు, వేపాకుల సమ్మేళనం ఏ రీతిలో చల్లగా ఉంటుందో తమను కూడా చల్లగా దీవించాల్సిందిగా దేవతను కోరడమే శాక సమర్పణ ఉద్దేశం.