ఆప్ విజయంపై స్పందనలు.. | Telangana CM hails AAP's victory | Sakshi
Sakshi News home page

ఆప్ విజయంపై స్పందనలు..

Published Wed, Feb 11 2015 1:27 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

Telangana CM hails AAP's victory

కేజ్రీవాల్‌కు అభినందనలు

సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు అభినందనలు. ప్రజలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచిస్తున్నారనేందుకు ఢిల్లీ ఫలితాలు ఒక ఉదాహరణ. కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆహ్వానించడం ద్వారా ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ప్రజాస్వామిక ఆకాంక్షను ఆమ్ ఆద్మీ గతంలో బలపరిచింది. కేజ్రీవాల్ నాయకత్వంలో అన్ని రంగాల్లో ఢిల్లీ పురోగమించాలి.    
- కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ముఖ్యమంత్రి

ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం
దేశ రాజధాని అయిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి అభినందనలు. ఈ విజయం ప్రజాస్వామ్యం గొప్పదనానికి నిదర్శనం.    
- చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఈ ఫలితాలు మోదీకి హెచ్చరిక
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీకి హెచ్చరికలాంటివి. భవిష్యత్తు రాజకీయాలకు ఇవెంతో ఉపయోగపడతాయి. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీని మట్టి కరిపించడం ద్వారా ప్రజలు లౌకిక శక్తులకు మద్దతుగా ఉన్నామని స్పష్టం చేశారు.
- బీవీ రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు

కొత్త సంస్కృతికి అద్దం
ఢిల్లీ ఫలితాలు కొత్త రాజకీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీల తర్వాత లోక్‌సత్తా, ఆప్ వంటి పార్టీల నాలుగో తరం రాజకీయాలు ఊపందుకుంటున్నాయి.     
- జయప్రకాశ్ నారాయణ, లోక్‌సత్తా

సామాన్యుని బలం తెలిసింది
ప్రజాస్వామ్యంలో సామాన్యుని బలమేంటో ఢిల్లీ ఫలితం తేల్చి చెప్పింది. మోసపూరిత హామీలతో ఏపీ ప్రజలను టీడీపీ నిలువునా వంచించింది. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం, నేతలు వింత పోకడలకు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహారించాలి.    
- వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎంపీ, కడప

బీజేపీ ఎనిమిది నెలల పాలనకు రెఫరెండం
కేంద్రంలో బీజేపీ 8 నెలల పాలనకు, దేశ ప్రజల అభిప్రాయాలకు ఢిల్లీ ఎన్నికల తీర్పు కొలమానం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదనే స్థాయిలో బీజేపీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీకి దేశమంతటా ఇదే తీర్పు తప్పదు. కాంగ్రెస్ దారుణ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం.
- కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఉత్తమ్, గీతారెడ్డి, చిరుమర్తి లింగయ్య

ఆప్ విజయం.. ప్రజా చైతన్యానికి నిదర్శనం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను అత్యధిక స్థానాల్లో గెలిపిస్తూ ఇచ్చిన తీర్పు.. ప్రజల చైతన్యానికి నిదర్శనం. ఇది కే ంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, మతవాద, మితవాద విధానాలకు వ్యతిరేకమైనది.  
- సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

భారత రాజకీయాల్లో కీలక ఘట్టం
డబ్బుతో రాజకీయాలను మార్చవచ్చన్న భావన తప్పని ఢిల్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. సామాన్యులు తలచుకుంటే ఎవరినైనా మట్టికరిపించగలరని రుజువైంది. ధన రాజకీయాలను నమ్ముకునే వారికి ఈ ఫలితాలు గొడ్డలిపెట్టు. భారత రాజకీయాల్లో ఇదో కీలక ఘట్టం.    
- టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం

కొత్త రాజకీయ సంస్కృతికి ప్రజల ఆహ్వానం
భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ కాకుండా మూడోపార్టీ బలంగా వస్తే ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. నూతన రాజకీయ సంస్కృతిని ప్రజలు ఆహ్వానిస్తారని అనడానికి ఇవి ఉదాహరణగా నిలుస్తాయి.  మోదీ సృష్టించిన భ్రమలు తొలగిపోయాయి.    
- ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎమ్మెల్సీ

కాంగ్రెస్, బీజేపీలపై వ్యతిరేకత
కాంగ్రెస్, బీజేపీ అవలంబించిన ఒకే రకమైన అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పిది. రెండు జాతీయ పార్టీలను తిరస్కరించారు. తమకు సేవలందిస్తామని కేజ్రీవాల్ చెప్పడంతో పాటు కొంచెం సంక్షేమంపై కూడా వాగ్దానం చేయడంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు.    
- ప్రొఫెసర్ హరగోపాల్

సామాన్యుడి విజయమిది
సామాన్యులు కూడా ఎలాంటి శక్తినైనా ఎదిరించి, ప్రజాస్వామ్య పద్ధతిలో విజయం సాధిస్తారనడానికి ఢిల్లీ ఫలితాలు తార్కాణం. తమ సమస్యలు ఆప్ అధికారంలోకి వస్తే పరిష్కారమవుతాయని ప్రజలు విశ్వసించారు. బీజేపీ ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై ప్రజల నిరసనగా ఈ తీర్పును చూడాలి.
- దేవీప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షుడు

మోదీ పతనానికి మొదటి ‘కేక’
ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుపు దేశ ప్రధాని నరేంద్రమోదీ పతనానికి మొదటి ‘కేక’  అవినీతి, మతోన్మాదాలకు ఎదురొడ్డి పోరాడినందునే ఢిల్లీ ప్రజలు ఆప్‌కి పట్టం కట్టారు. ఈ ఏడాది జూలై 26న విజయవాడలో  ప్రారంభించనున్న నవ్యాంధ్ర పార్టీకి, ఆప్‌కు స్నేహ సంబంధాలు par కొనసాగుతాయి.
- ఏపీ దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తిపద్మారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement