సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన టీఆర్‌ఎస్
Published Wed, Sep 4 2013 6:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తీర్మానం చేసిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే ఇప్పుడు దీక్షలు చేయడమేమిటని టీఆర్‌ఎస్ ప్రశ్నించింది. అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో అందరం కలసి మాట్లాడింది వాస్తవం కాదా? అని నిలదీసింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, కె.విద్యాసాగరరావు, జోగు రామన్న, పార్టీ నేతలు మంగళవారం తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు వాటితోనే చరిత్రహీనులుగా మారిపోవడం ఖాయమని సీమాంధ్ర నేతలను హరీష్‌రావు హెచ్చరించారు. సీమాంధ్రలో అందరూ మాట మీద నిలబడరన్న అపవాదు వచ్చే ప్రమాదం ఉందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాటల్లో మూడోసారి అధికారం దక్కదన్న నైరాశ్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, అంతేకాలం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించిన నాయకుడిలా ఆయన వ్యవహారశైలి లేదని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట చెబుతోందని ఆరోపించారు.
మొదటి నుంచీ తమది సమైక్య ఆంధ్రప్రదేశ్ నినాదమే అని చెబుతున్న వారు... గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ, జగన్, షర్మిల ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు చెందిన కొన్ని మీడియా చానెళ్లను సీమాంధ్ర ప్రాంతం వారు బహిష్కరిస్తే తాము కూడా అదే తీరున వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ సీఎం కిరణ్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలపై హరీష్‌రావు, టీఆర్‌ఎస్ నేత డి.శ్రవణ్‌లు ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
Advertisement