- టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు
- నేడు ‘తెలంగాణ జాగృతి’ కవిత, రాష్ట్ర మంత్రి ‘ఈటెల’ జిల్లాకు రాక
హన్మకొండ సిటీ : తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ అంతర్భాగమని టీఆర్‌ఎస్ జిలా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. గురువారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాల యం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి బతుకమ్మ కొత్తరూపును తీసుకురావడమే కాకుండా సంస్కృతిలో అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పర్యటనకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు.
మంత్రి ఉదయం 9.30 గంటలకు హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకున్న తర్వాత దుగ్గొండి, నర్సంపేట, కొత్తగూడ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని వివరించారు. తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉదయం 9 గంటలకు భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. తర్వాత హన్మకొండ శ్యామలా గార్డెన్‌సలో ఏర్పాటు చేసిన తెలంగా ణ జాగృతి జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
సాయంత్రం 6.00 గంటలకు హన్మకొండ మర్కజీ స్కూల్ వద్ద తెలంగాణతల్లి విగ్రహం నుంచి నిర్వహించే బతుకమ్మ ర్యాలీలో టీఆర్‌ఎస్ శ్రేణులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు వీరమ్మ, టీఆర్‌ఎస్ నాయకులు లింగంపల్లి కిషన్‌రావు, అంజయ్య, జోరిక రమేష్, బండి రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.