తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం స్పష్టీకరణ
సొంత జిల్లా ఆధారంగానే ఉద్యోగులను కేటాయించాలి
ముసాయిదా బిల్లును సవరించాలి
తెలంగాణ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తే మళ్లీ ఉద్యమం తప్పదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులో పేర్కొన్న ఉద్యోగుల పంపిణీ ప్రతిపాదనలను సవరించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులను ఆప్షన్ల ఆధారంగా కేటాయిస్తామని, డిప్యుటేషన్లపై భర్తీ చేస్తామని అంటే ఒప్పుకొనేది లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.హనుమంతునాయక్, ఇతర నేతలు హరికిషన్, అర్జున్‌రావు, అరవింద్‌రెడ్డి, ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు.
గత సంప్రదాయాలను అనుసరించి సొంత జిల్లా ఆధారంగానే పోస్టులను కేటాయించాలని కోరారు. లోకల్, జిల్లా, జోన్, మల్టీజోన్ ఉద్యోగులను ఎక్కడి వాళ్లను అక్కడే ఉంచాలని ముసాయిదాలో పేర్కొనడం అన్యాయమని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే ఆ క్లాజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అవసరానికన్నా ఎక్కువ పోస్టులు వస్తే సూపర్‌న్యూమరీ పోస్టులు ఇవ్వాలని, తక్కువ పోస్టులు వస్తే కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని, అంతేగానీ ఆప్షన్లు, డిప్యుటేషన్ల పేరిట మళ్లీ ఆక్రమిస్తామంటే సహించేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ఆర్టికల్ 315 (1) ప్రకారం వెంటనే తెలంగాణ రాష్ట్రానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల పంపిణీకి సలహా కమిటీ ఏర్పాటు చేసిన ఆరునెలల్లోపే ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఉద్యోగుల అంశాల సవరణల కోసం అన్ని పార్టీలు, ఉద్యోగ సంఘాలతో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. విభజన ప్రక్రియ తుదిదశకు చేరుకున్న తరుణంలో నాన్‌రెవెన్యూ కోటాలో ఐఏఎస్ పదోన్నతుల ప్రక్రియను ఆగమేఘాలపై నిర్వహించాల్సిన అవసరమేముందని చంద్రశేఖర్‌గౌడ్ ప్రశ్నించారు.
డైరీ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా కేసీఆర్
తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రూపొందించిన 2014 డైరీని రవీంద్రభారతిలో మంగళవారం సాయంత్రం ఐదుగంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. టీ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ, ఉద్యోగసంఘాల నేతలు దేవీప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్, రసమయి బాలకిషన్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొంటారని చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు.