
మలుపులు తిరుగుతున్న ‘విభజన’: కిషన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మున్ముందు పలు మలుపులు తిరగవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మున్ముందు పలు మలుపులు తిరగవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమని, మరోటని ఇప్పటికే మీడియాలో పలు రకాలుగా కథనాలు వెలువడుతున్నాయన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 21న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించ తలపెట్టిన సభకు మద్దతివ్వాలంటూ ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో పలు విద్యార్ధి సంఘాల నేతలు శనివారం కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ సెప్టెంబర్ 29న గుంటూరులో నిర్వహించే సభకు కూడా పూర్తిస్థాయిలో బీజేపీ సహకారాన్ని కోరారు. ఓయూ సభకు తమ పార్టీ మద్దతిస్తుందని కిషన్‌రెడ్డి వారికి చెప్పారు. గుంటూరు సభలోనూ తమ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని హామీ ఇచ్చారు. ‘తెలంగాణపై కేబినేట్ నోట్ తయారీకి కేవలం 60 నిమిషాలు చాలు. కానీ కేంద్రంలో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్లే ఇంత ఆలస్యం జరుగుతోంది. సీమాంధ్ర ఉద్యమం ఆ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం’ అని అన్నారు. కాగా, సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే ఏపీ ఎన్జీవోలు గానీ, ఇతర పార్టీలు గానీ ఎందుకు స్పందించడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా సీమాంధ్రలో తమ పార్టీ నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నా లు జరుగుతుంటే ఎందుకు ఖండిం చడం లేదని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబును ప్రశ్నించారు.