పార్లమెంటు ఉభయసభల్లోనూ సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు తొలి రోజే సమైక్యాంధ్ర సెగ గట్టిగా తగిలింది. ఇంతకాలం తెలంగాణ నినాదాలతో మారుమోగిన ఉభయ సభలు సోమవారం సమైక్య నినాదాలతో ప్రతిధ్వనించాయి. సీమాంధ్రకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు సోమవారం ఉభయ సభల్లోనూ ‘కలసికట్టుగా’ ఆందోళనలకు దిగారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదాలతో కార్యకలాపాలను పదేపదే అడ్డుకున్నారు. ‘సీమాంధ్రకు న్యాయం కావాలి’, ‘మాకు సమైక్యాంధ్రప్రదేశ్ కావాలి’ అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శిచారు. బోడోలాండ్ నినాదంతో ఇద్దరు బోడో పీపుల్స్ ఫ్రంట్ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ పెద్దగా కార్యకలాపాలేమీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. తాము తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం లేదని అనంతరం టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో తెలుగు మీడియాకు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతాలకు న్యాయం జరగాలని మాత్రమే తాము కోరుతున్నట్టు స్పష్టం చేశారు. విభజనే అనివార్యమైతే దాని ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంటు ఒకటో నంబరు గేటు ప్రధాన ద్వారం మెట్లపై అరగంట పాటు బైఠాయించారు.
ఉభయ సభల్లోనూ ఉద్రిక్తతే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊహించినట్లుగానే ఉభయ సభలనూ కుదిపేసింది. సోమవారం ఉదయం సభలు సమావేశమై కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, ఇటీవల కన్నుమూసిన మాజీ సభ్యులకు నివాళులు పూర్తవగానే ‘సమైక్య’ ఆందోళనలకు తెర లేచింది. సీమాంధ్ర ఎంపీలు ఉభయ సభల్లోనూ సభాధ్యక్ష స్థానాల వద్దకు దూసుకెళ్లారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు. తెలంగాణ ఇచ్చినప్పుడు బోడోలాండ్ ఎందుకివ్వరంటూ అస్సాంకు చెందిన బీపీఎఫ్ సభ్యులు కూడా భారీ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వారిని శాంతింపజేయడానికి లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభలోచైర్మన్ హమీద్ అన్సారీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభను ఒకసారి, రాజ్యసభను రెండుసార్లు అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. భోజన విరామం తర్వాత కూడా లోక్‌సభ మరో రెండుసార్లు, రాజ్యసభ రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులు తిరిగి వెళ్లాల్సిందేనన్న కేసీఆర్ ప్రకటన తాలూకు పత్రికా కథనాలను లోక్‌సభలో సభ్యులు ప్రదర్శించారు. జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తానని మీరాకుమార్ పేర్కొన్నా పట్టించుకోలేదు. టీడీపీకి చెందిన మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, పి.శివప్రసాద్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యులను సోనియాగాంధీ స్వయంగా పలుమార్లు వారించడంతో వారు సభా మధ్యంలోకి ప్రవేశించలేదు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఎస్పీవై రెడ్డి, లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, జి.వి.హర్షకుమార్, బొత్స ఝాన్సీ, కనుమూరి బాపిరాజు, సబ్బం హరి ముందువరుస స్థానాల వద్దే నిలబడి టీడీపీ సభ్యులకు మద్దతుగా నిరసన కొనసాగించారు. సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడాలంటూ నినదించారు. బీపీఎఫ్‌కు చెందిన కోక్రాఝార్ ఎంపీ ఎస్.కె.బిస్మత్యారీ కూడా వారికి జత కలిశారు. సభ్యులకు నచ్చజెప్పేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా విఫలయత్నం చేశారు. గందరగోళం మధ్యే కీలకమైన ఆహార భద్రత బిల్లును కేంద్ర మంత్రి కేవీ థామస్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
కలిసొచ్చిన సమాజ్‌వాదీ
రాజ్యసభలోనూ అవే దృశ్యాలు కన్పించాయి. టీడీపీ సభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి, సి.ఎం.రమేశ్, బీపీఎఫ్ సభ్యుడు బిశ్వజిత్ దైమారీ రోజంతా కార్యకలాపాలను స్తంభింపజేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో వారు ప్లకార్డులతో సభాధ్యక్ష స్థానాన్ని చుట్టుముట్టి సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సమాజ్‌వాదీ ఎంపీలు కూడా వారి వాదనకు మద్దతుగా నిలిచారు. దాంతో తొలుత 15 నిమిషాలకు, తర్వాత మధ్యాహ్నం 12 దాకా సభను చైర్మన్ వాయిదా వేశారు. తెలంగాణ నిర్ణయం ప్రభావం దేశవ్యాప్తంగా పడిందని బైస్య (ఏజీపీ), నరేశ్ అగర్వాల్ (ఎస్పీ) అన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయడమే గాక సమగ్ర చర్చకు అనుమతించాలని డిప్యూటీ చైర్మన్‌తో వాదనకు దిగారు. దాంతో ఆయన సూచన మేరకు, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి పలు కీలకాంశాలపై కేంద్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకున్నాక దానిపై పార్లమెంట్ సమగ్రంగా చర్చించవచ్చంటూ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రకటన చేశారు. అయినా ఎంపీలు శాంతించకుండా ఆందోళన కొనసాగించారు.
‘టీడీపీ అనుకూలంగా లేఖలిచ్చి విభజనను అడ్డుకుంటోంది’
తెలంగాణకు అనుకూలమని అన్ని సమావేశాల్లోనూ చెప్పి లేఖలు ఇచ్చిన టీడీపీ, ఇప్పుడు అదే తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ధ్వజమెత్తారు. తెలంగాణకు అనుకూలమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా లేఖలు ఇచ్చిన తర్వాత మీరెందుకు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ సీమాంధ్ర ఎంపీలను వారు సూటిగా ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్‌లు విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే ందుకు సీమాంధ్ర నేతలు కృత్రిమ ఉద్యమం సృష్టిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయండని, శాశ్వత ఉమ్మడి రాజధాని చేయండని కోరడం సమంజసం కాదన్నారు.
జేడీ శీలం వర్సెస్ బలరాం నాయక్
రాష్ట్ర విభజన అంశం పార్లమెంట్ సమావేశాల తొలిరోజునే సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధానికి దారితీసింది. సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు బహిరంగంగానే గొడవకు దిగారు. హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా కొనసాగాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రి జె.డి.శీలంతో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బలరాం నాయక్ వాగ్వాదానికి దిగారు. బలరాంకు మద్దతుగా రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రంగంలోకి దిగారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల ఎంపీలు, కేంద్ర మంత్రుల సమక్షంలో వీరిమధ్య 20 నిమిషాల సేపు సంవాదం సాగింది.