సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న ప్రతిపాదనకు అంగీకరించే విషయాన్ని పునరాలోచించుకోవాలని తెలంగాణ జేఏసీ యోచిస్తోంది. జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన మంగళవారం జరిగిన స్టీరింగ్ కమిటీ భేటీలో.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం మేరకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అంగీకరిస్తే.. కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేతలు అభిప్రాయపడ్డారు.
గత రెండు జేఏసీ సమావేశాలకు దూరంగా ఉన్న బీజేపీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఆ పార్టీ ప్రతినిధులుగా రాజేశ్వరరావు, వేణుగోపాలరెడ్డి, అశోక్‌కుమార్‌యాదవ్, సుధాకర్‌శర్మలు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ప్రతినిధిగా డి.శ్రవణ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలో రెండు వర్గాల ప్రతినిధులుగా ఝాన్సీ, సంధ్య, ఉద్యోగ సంఘ నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, విఠల్, తెలంగాణ మాలమహానాడు నేత అద్దంకి దయాకర్ తదితరులు హాజరయ్యారు.
అధ్యయనానికి నిపుణుల కమిటీ...
పదేళ్లపాటు ఉమ్మడి రాజధానికి తెలంగాణవాదులు అంగీ కారం తెలిపే విషయంలో మెతకగా వ్యవహరించినందునే సీమాంధ్ర నేతలు ఈ అంశాన్ని జటిలం చేసేందుకు యత్ని స్తున్నారన్న భావన భేటీలో వ్యక్తమైంది. సీమాంధ్ర ఎత్తుగడను అడ్డుకునేందుకు ప్రతిఘటన కార్యక్రమాలు చేపట్టటమే మంచిదనే నిర్ణయానికి నేతలు వచ్చారు. హైదరాబాద్‌ను యూటీగా ప్రకటించకుండానే ఉమ్మడి రాజధానిగా ప్రకటించే అవకాశాలకుగల న్యాయపరమైన అంశాలపై ఆరా తీశారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మించుకునే వరకు హైదరాబాద్‌ను మొత్తం ఉమ్మడి రాజధానిగా ఉంచే బదులు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయం వంటి కీలక కార్యాలయాలుండే నగరంలోని ఒకటి రెండు మండలాల ప్రాంతాన్ని మాత్రమే రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాంతంగా ఉంచే అవకాశాలున్నాయా అన్నదాని పై చర్చించారు. చివరకు హైదరాబాద్ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిని అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ కమిటీ నెలాఖరులోగా ఒక సదస్సును నిర్వహించి తగు సూచనలు చేయనుంది.
30న హైదరాబాద్‌లో టీ-జేఏసీ సభ: కోదండరాం
తెలంగాణ నోట్‌ను కేంద్రం త్వరగా పూర్తిచేసి, ఆ తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా బిల్లును ఆమోదించాలన్న డిమాండ్‌తో టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లో బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. అయితే తేదీ మారే అవకాశాలూ ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో జరిపే సభకు ముందూ, తరువాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై చర్చించేందుకు 14న జేఏసీ విస్త్తృతస్థాయి సమావేశం జరుగుతుందన్నారు.
ఏపీఎన్‌జీవోల సభ వల్ల పెరిగిన ఘర్షణ వాతావరణంతో హైదరాబాద్‌ను పదేళ్ల ఉమ్మడి రాజధానిగా అంగీకరించడంపై పునరాలోచన చేయాలని జేఏసీపై ఒత్తిడి వస్తోందన్నారు. దీనిపై జేఏసీ విస్త్తృతస్థాయి భేటీలో చర్చిస్తామన్నారు. ఏపీఎన్‌జీవోల సభ సంద ర్భంగా జరిగిన ఘర్షణల కేసుల్లో అరెస్టుల విషయంలో సర్కారు వివక్ష చూపుతోందన్నారు. సీమాంధ్రలో బీజేపీ, సీపీఐ కార్యాలయాలపై దాడులు జరగడాన్ని జేఏసీ ఖండిస్తోందన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను విరమింపజేసే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా, ప్రేక్షక పాత్ర వహిస్తుం డడాన్నిబట్టి ఈ సమ్మెను సర్కారే నిర్వహిస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయని దేవీప్రసాద్ అన్నారు.