విలీనం తర్వాత రెండేళ్లకే పశ్చాత్తాపం | telangana leaders disliked on merge with andhra 5 decides | Sakshi
Sakshi News home page

విలీనం తర్వాత రెండేళ్లకే పశ్చాత్తాపం

Published Thu, Jan 23 2014 4:09 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

విలీనం తర్వాత రెండేళ్లకే పశ్చాత్తాపం - Sakshi

విలీనం తర్వాత రెండేళ్లకే పశ్చాత్తాపం

సాక్షి, హైదరాబాద్:  ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావాలని అప్ప ట్లో కొందరు తెలంగాణ నేతలు కోరింది నిజమేనని, అయితే రెండేళ్లకే వారు పశ్చాత్తాప పడ్డారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. బుధవారం ఆయన జేఏసీ ముఖ్య నేతలు కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, మాదు సత్యం, కృష్ణ యాదవ్‌తో కలిసి జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో విలీనం కావడానికి ముందుగా చేసుకున్న ఒప్పందాలు, షరతులను అమలు చేయకపోవడంతో తెలంగాణ నేతలు రెండేళ్లకే బాధపడ్డారని పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన గుప్పెడుమంది కో సం తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసం చేశారని విమర్శించారు. తెలంగాణలో ఉపాధికోసం, సంపద సృష్టికోసం ఏర్పాటుచేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటివాటిని సమైక్య పా లకులు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని కోదండరాం ధ్వజమెత్తారు. ప్రస్తుతం అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లులోని అంశాల గురించి చర్చించకుండా నిజాంపై మాట్లాడుతూ రాష్ట్రపతి ఇచ్చిన గడువును సీమాంధ్ర పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు.
 
 నిజాం ఎంత నిరంకుశంగా పాలించాడో అంతకంటే అరాచకంగా సీమాంధ్ర పాలకులు వ్యవహరించారని ఆరోపిం చారు. తెలంగాణకోసం, హక్కుల కోసం అడిగే పరిస్థితి కూడా లేకుండా అప్రజాస్వామికంగా పాలించారని విమర్శించారు. శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసత్యాలను, అభూత కల్పనలను చెప్తున్నారని, వాటికి తగిన సమాధానం చెప్తామని కోదండరాం అన్నారు. సమ్మక్క-సారక్క జాతరకో సం ప్రభుత్వం శాశ్వత ఏర్పాట్లు చేయడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించడానికి జేఏసీ బృందం వెళ్తుం దని వెల్లడించారు. కత్తి వెంకటస్వామి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీమాంధ్ర సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడం లో అక్క డి నేతలు విఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాద్‌లో తెలంగాణవాదుల సభలకు అనుమతి ఇవ్వకుండా సీమాంధ్ర సభలకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తున్నదన్నారు.
 
 ఫిబ్రవరిలో ఢిల్లీలో వర్క్‌షాపు
 టి.బిల్లులో సవరణల అంశంపై చర్చించడానికి ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతున్న తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. శాసనసభలో బిల్లుపై చర్చ పూర్తయిన తర్వాత ఢిల్లీ పర్యటన పెట్టుకోవాలని నిర్ణయించారు.
 
 సింగరేణి నిర్వాసితులకు పరిహారం పెంచాలి
 సింగరేణి భూ నిర్వాసితులకు కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం కోదండరాం, అద్దంకి దయాకర్, భూ నిర్వాసితుల సంఘం నేత రంగరాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని భూములకు ప్రభుత్వం పాత చట్టాల ప్రకారం పరిహారం ఇవ్వాలని చూస్తోందని, దీని వల్ల భూమిని కోల్పోయినవారికి అన్యాయం జరుగుతుందని రంగరాజు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement