పోరులో మాదిగల పాత్ర ప్రశంసనీయం
కార్పొరేట్ కంపెనీలతో చేతివృత్తులు కనుమరుగు
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
ఖమ్మం, న్యూస్‌లైన్
తెలంగాణ ప్రాంత ప్రజలు న్యాయపరమైన హక్కుల కోసం పోరాడారని, దోపిడీ, అణచివేతకు గురైన అన్ని వర్గాల వారి ఐక్య ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఎస్సీల వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన అమరుల ఆత్మఘోష మహాసభ ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో సోమవారం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. మాదిగలు లేనిదే కాలుకు చెప్పులు లేవని, అసలు నడకే లేదని అన్నారు. పురాతన కాలం నుంచి అనేక అవసరాలకు పనిముట్లు సరఫరా చేసిన మాదిగలు.. కార్పొరేట్ కంపెనీలతో ప్రమాదంలోకి నెట్టివేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల వారు తెలంగాణ ఉద్యమంలో ఒకే వేదికపైకి వచ్చారని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మరెంతో దూరంలో లేదని అన్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య రాగద్వేషాలు పెంచేలా ఉందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేవారు. జయశంకర్ సారు చెప్పినట్లు ఉద్యమానికి భావ వ్యక్తీకరణ, ఆందోళన, రాజకీయ చైతన్యం అవసరం అని అన్నారు.
తెలంగాణ ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు బిక్షపతి మాదిగ మాట్లాడుతూ మాదిగల హక్కుల సాధన తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమన్నారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, అణచివేతకు గురైనవారికి సమాన న్యాయం చేయాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. కృపాకర్ మాదిగ మాట్లాడుతూ సీమాంధ్రలో కొంతమంది పెత్తందారులు మాత్రమే రాష్ట్రం విడిపోవద్దని కోరుకుంటున్నారని అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇరు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. గతంలో ప్రకటించిన మాదిరిగానే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేయాలని అన్నారు. జనరల్ డయ్యర్‌ను పోలిన విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు బండి వీరయ్య మాదిగ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటపతిరాజు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ తిరుమలరావు, టీఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు బచ్చలికూర వెంకటేశ్వర్లు మాదిగ, బాబూజాన్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఐక్య ఉద్యమాలతోనే తెలంగాణ
Published Tue, Jan 28 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement
Advertisement