సాక్షి ప్రతినిధి, కడప: అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంతో జిల్లాలో వ్యవహారం అంతా ఆ ఇరువురు బ్రదర్స్ చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం ఆర్టీపీపీలో వారి హవా జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధమైనా వారు చెప్పిందే వేదంగా యంత్రాంగం మసులుకుంటోంది. ముఖ్యమంత్రికి సన్నిహితులమంటూ బెదిరింపులే పెట్టుబడిగా లబ్దిపొందుతున్నారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో గ్రీనరీ ఏర్పాటు సైతం అధికరేట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. గతంలో 26 శాతం తక్కువకు కోట్‌చేసి టెండర్లు దక్కించుకున్న సంస్థకు ఈమారు అధికరేట్లకు కట్టబెట్టుతూ డెరైక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీపీపీలో నిర్మిస్తున్న 6వ యూనిట్ పరిధిలో గ్రీనరీ ఏర్పాటుకు రూ.52 లక్షలతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌లో డెరైక్టర్లు పరిధిలో నిర్వహించిన ఈ టెండర్లల్లో అధికార పార్టీ పరపతి ఉపయోగించింది. ముగ్గురు మాత్రమే పాల్గొనేలా చూసినట్లు సమాచారం. అయితే రెండు టెండర్లు అర్హత లేనివని తెలుస్తోంది. కేవలం డమ్మీగా ఆ రెండు టెండర్లు వేసినట్లు సమాచారం. ఒకే ఒక్క సంస్థకు అర్హత ఉంది. ఆసంస్థ ఎక్సెస్ రేట్లుకు దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్‌ను ఓకే చేయలేమని యంత్రాం గం పేర్కొన్నా, బ్రదర్స్ రంగ ప్రవేశం చేసి ఖరారు చేయించినట్లు తెలుస్తోంది.
గతంలో 26శాతం తక్కువకే
కేటాయింపు...
అధికరేట్లకు ఏకైక టెండరు దాఖలైతే రద్దుచేసి తిరిగి టెండర్ పిలవాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే పోటీపడ్డ మూడింటిల్లో రెండు సంస్థలు నిబంధనల మేరకు అర్హత లేనివని సమాచారం. 4 శాతం ఎక్కువ ధరలకు కోట్ చేసిన లక్ష్మీకన్‌స్ట్రక్షన్స్ మాత్రమే సింగిల్ టెండరు దాఖలైంది. అయినా డెరైక్టర్ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ సంస్థకు కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం కలమల్ల టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలి కుటంబానికి చెందిన సంస్థ కావడమేనని సమాచారం.
అంతేకాదు ఆర్టీపీపీలో పర్మినెంటు ఉద్యోగులు టెండర్లు దాఖలు చేయడం, కాంట్రాక్టులు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. ప్రస్తుతం ఆ ఎంపీటీసీ సభ్యురాలి భర్త ఆర్టీపీపీలో పర్మినెంటు ఉద్యోగి. గతంలో 26 శాతం తక్కువకు టెండర్లు దక్కించుకున్న సంస్థ ప్రస్తుతం 4శాతం అదనపు రేట్లుకు టెండర్లు దక్కించుకోవడం వెనుక అధికారమే అసలు రహస్యంగా కనిపిస్తోంది. గతంలో 26శాతం తక్కువ రేట్ల ప్రాతిపదికన తీసుకుంటే ప్రస్తుత 4 శాతం ఎక్కువకు పడడం వల్ల రూ.15 లక్షలు జన్‌కోకు నష్టం. ఆమేరకు టీడీపీ నేతలకు లాభం.
‘లక్ష్మీ’కటాక్షం!
Published Sun, Mar 1 2015 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement