‘కింగ్’ క్యాలెండర్‌లో తెలుగు ‘క్వీన్’ | Telugu girl Sobhita Dhulipala on the Kingfisher calendar | Sakshi
Sakshi News home page

‘కింగ్’ క్యాలెండర్‌లో తెలుగు ‘క్వీన్’

Published Sat, Jan 11 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

‘కింగ్’ క్యాలెండర్‌లో తెలుగు ‘క్వీన్’

‘కింగ్’ క్యాలెండర్‌లో తెలుగు ‘క్వీన్’

మనకు తెలిసిన క్యాలెండర్‌లో తేదీలు మాత్రమే ఉంటాయి. ‘ఆ క్యాలెండర్..’ మాత్రం తేదీల సంగతి మరిచిపోయేలా చేస్తుంది. కళ్లార్పకుండా తనవైపే చూసేలా చేస్తుంది. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ అంటే పోతపోసిన సౌందర్యం. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ అంటే అందాల రాణుల ఆవాసం. లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన విలాసపురుషుడు విజయ్‌మాల్యా సృష్టించిన అందాల ఇంద్రజాలం అది. కత్రినాకైఫ్, దీపికా పదుకునే... వంటి ఎందరో బాలీవుడ్ తారలను మోసుకొచ్చి, గ్లామర్ రంగంలో విజయానికి తొలి అడుగులా పేరొందిన... ఆ క్యాలెండర్‌లో స్థానం సంపాదించాలని భారతదేశంలోని ప్రతి అందాలరాశి ఉవ్విళ్లూరుతుంది. అలాంటి అందాల క్యాలండర్‌లో మరో తెలుగమ్మాయి త‘లుక్’మంది. ఆమే శోభిత. నగరానికి చెందిన శిల్పారెడ్డి తర్వాత సదరు ‘కింగ్’డమ్‌లో పాదం మోపిన శోభిత ధూళిపాళ చెప్పిన క్యాలెండర్ కబుర్లు...
 
 నేపథ్యం

 జన్మతః మాది విశాఖపట్టణం. బిజినెస్ ఇన్ కార్పొరేట్ లా లో మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రస్తుతం ముంబయిలో ఉన్నాను. దక్షిణాది తరఫున హైదరాబాద్‌లో జరిగిన మిస్ ఇండియా ఆడిషన్స్‌లో పాల్గొనడమే గ్లామర్ రంగంలో నా తొలి అడుగు. అనంతరం అదే పోటీల్లో బెంగళూరులో మిస్ సౌత్‌గా గెలిచాను. ఫైనల్స్‌లో మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్నాను. అది నాకు మోడలింగ్ అవకాశాల్ని పెంచింది. అసలు మోడలింగ్ అనేదే నా కెరీర్‌ప్లాన్‌లో లేదు. అలాంటిది అనుకోకుండా బిజీమోడల్ అయిపోయాను.
 
 క్యాలెండర్‌లోనా.. నేనా?

 ముంబయిలో జరిగిన మిస్‌దివా కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఫొటోగ్రాఫర్ అతుల్‌కస్బేకర్ కనిపించారు. కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌కు పనిచేస్తారా..! అనడిగారు. ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ చూడకపోయినా... పెద్ద పెద్ద స్టార్స్ అంతా చేసిన క్యాలెండర్ అని తెలుసు. గ్లామర్ రంగంలో తొలిమెట్టు మీదే ఉన్న నేను ఆ క్యాలెండర్లోనా? అనుకున్నాను. వెంటనే ఓకే చెప్పేశాను. అతుల్ నా ఫొటోలు విజయ్‌మాల్యాకు పంపారు. షార్ట్ లిస్టింగ్, ఎన్నో వడపోతల త ర్వాత సెలక్టయ్యాను. తర్వాత కొంచెం ఆలోచించాను. అయితే ‘నువ్వు హ్యాపీగా ఫీలైతే చేసెయ్’ అంటూ ఇంట్లోవాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక అన్నీ మరిచిపోయాను.     
 
 ఉప్పునీళ్లు నోట్లో.. ఆనందం చూపుల్లో

 ఫొటో షూట్ కోసం కొన్ని సార్లు కఠినమైన ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. ఒకసారి నీళ్లలో తేలుతూ 20 నిమిషాల పాటు కదలకుండా ఉండాలి. కిందంతా ఉప్పునీళ్లు, పైన చుర్రుమనే ఎండ, నీళ్లు నోట్లోకి వెళ్లిపోతున్నాయి. అలాంటి స్థితిలోనూ అద్భుతమైన ఆనందాన్ని చూపించాలి. అలాగే ఇంకో సారి చేపల మధ్యలో అవి మన చుట్టూ ఉండగా... షూట్... నిజంగా ఇవన్నీ భలే అనుభవాలు. ఎప్పటికీ గుర్తుండిపోతాయి. క్యాలెండర్ చూశాక నేనేనా అని ఆశ్చర్యపోయాను. నేను ఇవన్నీ చేస్తానని చేయగలనని ఎప్పుడూ అనుకోలేదు. చాలా మంది మోడల్స్‌కి కలలాంటిది నాకు మాత్రం ఈజీగా అందుబాటులోకి వచ్చిందనిపించింది.
 
 అందానికి అందలం

 కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గురించి కొన్ని వర్గాల్లో ఉన్నవన్నీ అపోహలే. ఈ క్యాలెండర్ కోసం పలువురు ప్రతిభావంతులు ఎంతో కష్టపడతారు. దీనికి ఆస్థాన ఫొటోగ్రాఫర్‌గా ఉన్న అతుల్ దేశంలోనే టాప్ ఫొటోగ్రాఫర్. ఈస్థటిక్‌సెన్స్-వల్గారిటీకి మధ్య ఉన్న సన్నని గీతను ఆయన అద్భుతంగా డీల్ చేశారు. టాప్‌లెస్‌గా చేసినా, మరెంత అందాన్ని ఒలికించినా... ఈ క్యాలెండర్‌లో మేమంతా దేవాలయాల్లో ఉండే అందమైన శిల్పాల్లా ఉంటాం తప్ప అశ్లీలంగా కనబడం.
 
 ఫొటో షూట్ ఓ అద్భుతమైన అనుభవం

 ఈ క్యాలెండర్ కోసం విభిన్న ప్రాంతాల్లో ఫొటోషూట్ చేశారు. ఫిలిప్పీన్స్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత అందమైన దీవుల్లో ఫొటోషూట్ జరిగింది. చుట్టూ ఎందరో గ్రేట్ పీపుల్. ఆ షూట్ అంతా ఒక హ్యాపీ ఫెస్టివల్‌లా మొత్తం 10 రోజులు జరిగింది. మొత్తం 6గురు గ్లామర్ క్వీన్స్ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వారితో స్నేహం ఎన్నో నేర్పింది. వాళ్లంతా అప్పటికే ప్రొఫెషనల్ మోడల్స్. వయసులోనూ, అనుభవంలోనూ అందరికంటే చిన్నదాన్ని నేను. దీవుల మధ్యలో బోటులో ప్రయాణం, షూట్ అయిపోయాక ఆటపాటలు... మాకంటూ ఉన్న స్పెషల్ కుక్ రోజుకో రకమైన క్యుజిన్ వంటకాలు వండి పెట్టడం... వంటివన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు.
 
 
 భవిష్యత్తు

 ప్రస్తుతం మోడలింగ్ ఆఫర్స్ ఉన్నాయి. మన టాలీవుడ్ సహా మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇటీవలే ఇండియా బ్రైడల్ వీక్ కోసం ర్యాంప్‌వాక్ చేశాను. త్వరలో జరగనున్న లాక్మేకి ప్రిపేరవుతున్నాను. వచ్చిన మంచి ఆఫర్స్ మిస్సవ్వకుండా అదే సమయంలో కీలక దశలో ఉన్న చదువు దెబ్బతినకుండా ప్లాన్ చేసుకుంటున్నాను.
 
 స్ఫూర్తి

 గ్లామర్ రంగంలో రాణిస్తున్న ప్రతి ఒక్కరిలో గ్రేస్ ఉంటుంది. అంత తేలికగా ఎవరూ ఈ రంగంలో ఉన్నత స్థాయికి రాలేరు. అందుకే ఒక్కొక్కరిలో ఉన్న ఒక్కో మంచి పాయింట్‌ని నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నాను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement