
ప్రమాదకర స్థితిలో తెలుగుభాష
నేడు తెలుగుభాష ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కడప: నేడు తెలుగుభాష ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 90వ జయంతి సందర్బంగా ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జానమద్ది కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ భాషకు పడుతున్న దురవస్థను తలచుకుంటే బాధ కలుగుతోందన్నారు. తరం గడిస్తే తెలుగు మాట్లాడేవారు ఎందరుంటారని ఆలోచిస్తేనే భయమేస్తుందన్నారు. తెలుగుభాషకు, బ్రౌన్ స్మారక గ్రం థాలయ నిర్మాణానికి జానమద్ది చేసిన సేవలు అపూర్వమని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
దేశాభివృద్దికి దోహదపడే సైన్స్-టెక్నాలజీతోపాటు భాషా, సాహిత్యాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని జస్టిస్ జాస్తి అన్నారు. పిల్లలు 1వ తరగతి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం తప్ప పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకోవడం లేదన్నారు. కంప్యూటర్లు క్యాలిక్యులేషన్స్ చెబుతాయేతప్ప అనుబంధాలను నేర్పలేవని, అది సాహిత్యం వల్లే సాధ్యమవుతుందన్నారు.