చీరకట్టులో నైజీరియన్ షిప్పింగ్ కంపెనీ లీగల్ విభాగం డెప్యుటీ డైరెక్టర్ గ్రీన్ అలా హబ్జా
అల్లిపురం(విశాఖ దక్షిణ): ‘‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అందమంతా చీరలోనే ఉన్నది’’ అన్న మనసుకవి మాటలు చీర మహిమేమిటో చెబుతాయి.. చీరకట్టి ఆడతనం పెంచుకొమ్మన్న యువకవి పదాలు ఆ ఆరుమూరల వస్త్ర విశేషం ప్రత్యేకతను చాటిచెబుతాయి. అయితే ఎన్ని విధాలా వర్ణించినా.. ఇంకా ఏదో మిగిలిపోయిందన్న విశిష్టత చీరకే ఉంది. నెమలిపింఛంలా, నీలి మేఘంలా, కడలి కెరటంలా, పూలగాలి తెమ్మెరలా ఎన్నెన్నో హొయలు పోయే చీర భారతీయ వనిత ఔన్నత్యానికి తిరుగులేని రీతిలో అద్దం పడుతుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ అందచందాల చీర నైజీరియా నుంచి వచ్చిన ఇంతి మనసును ఆకట్టుకుంది.
కట్టులో వింత ఆమెను విస్మయానికి గురిచేసింది. విశాఖకు తమ కంపెనీ పని మీద వచ్చిన నైజీరియా దేశస్తురాలు గ్రీన్ అలా హబ్జాకు చీర మీద చాలా మనసైంది. ఏదేశం మగువైనా ఒకటే కదా. వెంటనే ఆమె చీరకట్టు గురించి వివరంగా తెలుసుకున్నారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నైజీరియా షిప్పింగ్‌కంపెనీ లీగల్ విభాగం డెప్యుటీ డైరెక్టర్ అయిన హబ్జా చీరకట్టులోనే పాల్గొని అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు.
ఈస్ట్ కోస్ట్ మారిటైం అకాడమీలో షిప్పింగ్‌లో ఎగుమతులు, దిగుమతుల అంశంపై శిక్షణ నిమిత్తం తాను వచ్చానని.. విశాఖ వచ్చిన దగ్గర నుండి ఇక్కడి వారి చీరకట్టు తనను ఎంతగానో మైమరపించిందని, అందుకే గత రాత్రి షాపింగ్‌కు వెళ్లి చీర, చెవి రింగులు, నక్లెస్ కొనుక్కొని, జాకెట్టు కుట్టించుకుని మరీ ధరించానని ఆమె సమావేశంలో చెప్పగానే అంతా కేరింతలు కొట్టారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సదస్సులో అలా ఆమె అందరిలో కేంద్రబిందువు అయ్యారు. భారతీయ సంప్రదాయాల్లో తెలుగువారి చీరకట్టు తనను ముగ్ధురాలిని చేసిందని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment