ఆలయ భూముల్లో అక్రమాలకు చెక్‌ | Temple Lands Monitoring By Endowment department In Eastgodavari | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల్లో అక్రమాలకు చెక్‌

Published Mon, Oct 21 2019 10:46 AM | Last Updated on Mon, Oct 21 2019 10:46 AM

Temple Lands Monitoring By Endowment department In Eastgodavari - Sakshi

కోట్లాది రూపాయల విలువైన దేవాలయ భూములను రైతులు ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూములకు శిస్తు రూపంలో ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో సాధారణ రైతుల మాదిరిగానే ఆలయాల భూములు సాగు చేసే రైతులకు కూడా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, తద్వారా శిస్తు సక్రమంగా వసూలయ్యే అవకాశముంటుందని అధికారులు గుర్తించారు. పైగా దీనివలన రైతులకు కూడా ప్రభుత్వ పరంగా రైతు భరోసా వంటి పథకాలు వర్తించనున్నాయి. దీంతో దేవదాయ శాఖ ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది.

సాక్షి,పిఠాపురం(తూర్పుగోదావరి) : దేవాలయాలకు చెందిన భూములు, వాటిని సాగు చేస్తున్న రైతుల వివరాలను బహిర్గతం చేయడం ద్వారా దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఆలయ భూములు సాగు చేసే వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి చర్యలు ఆరంభించింది. ఇందులో భాగంగా దేవాలయ భూములను సాగు చేసే రైతుల సమగ్ర వివరాలను ఆయా మండలాల్లోని తహసీల్దార్లకు అందజేస్తున్నారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక అధికారులు ఆ పనిలో తలమునకలయ్యారు. మన జిల్లాలోని 1,724 ఆలయాలకు సుమారు 22,695 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవికాకుండా భక్తుల నుంచి నిత్యం లభించే ఆస్తులు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం భూములు ఎక్కువ శాతం అన్యాక్రాంతమై దళారుల చేతుల్లో మగ్గిపోతున్నాయి. గతంలో కొందరు దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు, కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి, తక్కువ కౌలుకు ఏళ్ల తరబడి ఇతరులకు ధారాదత్తం చేయడంతో దేవాలయాలకు చెందిన అనేక భూములు అన్యాక్రాంతమయ్యాయి.

వారికి రైతు భరోసా!
కౌలు అర్హత కార్డులను ప్రభుత్వం జారీ చేస్తే ఆలయాల భూముల వివరాలు, వాటిని సాగు చేస్తున్న రైతుల వివరాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనివలన భూమి శిస్తు కూడా సక్రమంగా వసూలవుతుందని భావిస్తున్నారు. తద్వారా ఆలయాలకు ఆదాయం పెరుగుతుంది. మరోపక్క నిజమైన కౌలు రైతుకు ప్రభుత్వం అందించే వైఎస్సార్‌ రైతు భరోసా సహాయం కూడా అందుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే ఆలయ భూములు సాగు చేసే రైతులకు కౌలు అర్హత కార్డులు ఇవ్వాలని, తద్వారా వారికి కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు అర్హులైన కౌలు రైతులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారికి వైఎస్సార్‌ రైతు భరోసా ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు తెలిపారు.

అందరు బయటపడతారా?
ఇప్పటికే దేవుడి భూములను అప్పనంగా పండించుకుంటున్న కొందరు రైతులు కౌలు గుర్తింపు కార్డుల కోసం బయటపడతారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అర్హత కార్డు తీసుకోవాలంటే తాము ఎంత భూమి సాగు చేస్తున్నదీ అధికారికంగా రికార్డుల్లో చూపించాల్సి ఉంటుంది. దీంతో కొందరు ఈ కార్డులు తీసుకోడానికి సుముఖత చూపరనే వాదనలు కూడా ఉన్నాయి. శిస్తు సక్రమంగా చెల్లించేవారు ముందుకు వచ్చినా, శిస్తు ఎగ్గొట్టేవారు మాత్రం ముందుకు రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ అధికారులు మాత్రం రెవెన్యూ రికార్డుల ఆధారంగా అన్ని భూములకు సంబంధించిన రైతుల వివరాలను బహిర్గతం చేయాలని భావిస్తున్నారు.

వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నాం
దేవస్థానం భూములు సాగు చేస్తున్న రైతుల్లో సక్రమంగా శిస్తు చెల్లిస్తున్న వారికి దేవదాయ శాఖ తరఫున సర్టిఫికెట్లు ఇస్తున్నాం. వాటి ఆధారంగా రెవెన్యూ అధికారులు కౌలు అర్హత కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. కొందరు రైతులు వచ్చి తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. వారి వివరాలను పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నాం. ఆ సర్టిఫికెట్‌ ఉన్న ప్రతి కౌలు రైతుకూ ప్రభుత్వం అందించే వైఎస్సార్‌ రైతు భరోసా ఆర్థిక సహాయం అందుతుంది.
– నరసింహారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement