
ప్రధాన అర్చకుడి భౌతికకాయం
చిత్తూరు,శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరాలయ ప్రధాన అర్చకులు, మీరాశీదారులు, స్థానాచార్యులు, దేవాదాయ ధర్మదాయశాఖ ఆగమ సలహాదారులు ఎస్‌ఎంకే సదాశివ గురుకుల్(82) 40 ఏళ్ల పాటు శివయ్యకు సేవలు అందించారు. అనారోగ్యంతో ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో ప్రభుత్వం మీరాశీ రద్దు చేసినప్పుడు దేవస్థానం అస్తులను పైసాతో సహా అప్పగించిన కుటుంబం గురుకుల్‌ది. దేవస్థానం ఆస్తులు ఆభరణాలు పరిరక్షించడంలోనూ ఆయన పాత్ర కీలకమైనది. ఆయన కన్నుమూయడంతో శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయం మూత వేశారు. ఆలయ ఈఓ శ్రీరామరామస్వామితోపాటు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధం గా ఆలయం నుంచి సారెను తీసుకువచ్చారు.
దేవస్థానం తరుఫున ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు మూత వేశారు. ఆయన అంత్యక్రియలు అయిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు అభిషేకాలు అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. అనంతరం యథావిధిగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన్ని చివరిసారిగా చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవస్థానం మాజీ చైర్మన్లు కోలా ఆనంద్, పోతుగుంట గురవయ్యనాయుడు, శాంతారామ్ జేపవర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు, పట్టణ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.
భరద్వాజ మహర్షి వంశీయులు
శ్రీకాళహస్తీశ్వరుని, జ్ఞానప్రసూనాంబను పూజించి తరించిన వారెందరో ఉన్నారు. వారిలో భరద్వాజ మహర్షి ముఖ్యుడు. ద్వాపర యుగానికి చెందిన ఈయన ఇక్కడనున్న వాయులింగేశ్వరుడిని పూ జించి ముక్తి పొందినట్లు స్థలపురాణం చెబుతుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజా విధానం, సంప్రదాయాలను ఆ కాలంలోనే అమలు చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. భరద్వాజుడు తమ పూజ కోసం తవ్వించిన పుష్కరిణే నేటి భరద్వాజ తీర్థంగా పేరుగాంచింది. సదాశివ గురుకుల్ భరద్వాజ మహర్షి వంశీయులు. 300 ఏళ్లుగా భరద్వాజ గోత్రానికి చెందిన వారే మీరాశీ విధానంలో ఆలయ ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సదాశివ గురుకల్ 40 ఏళ్లుగా శ్రీకాళహస్తి దేవస్థానంలో శివయ్యకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన వృద్ధాప్యం నేపథ్యంలో ఆయన అన్న కుమారుడు స్వామినాథన్ గురుకుల్ స్వామి, అమ్మవార్లకు ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు.