
‘పది' రెట్లు !
గుంటూరు ఎడ్యుకేషన్
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నుంచి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ధేశించిన ఫీజులను పక్కనపెట్టి జిల్లాలోని పలు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయి. అసలు ఫీజుకు దాదాపు 10 రెట్లు అదనంగా డిమాండ్ చేస్తూ, ఆ మొత్తం చెల్లించని పక్షంలో విద్యార్థులకు హాల్ టికెట్లు రావంటూ భయపెడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు.
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లాలో దాదాపు 60 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెంది 25 వేల మంది ఉండగా, మిగిలిన వారు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు. వీటిలో పలు పాఠశాలలు ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజు వసూలు చేస్తుండగా, మరికొన్ని అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ. 125 చెల్లించాలి. ప్రైవేటు విద్యార్థులు హాజరు మినహాయింపు కోరుతూ కాండొనేషన్ ఫీజు రూ. 650, పరీక్ష ఫీజు రూ.125తో కలిపి మొత్తం రూ.775 చెల్లించాల్సి ఉంది.
గతంలో పరీక్ష రాసి ఫెయిలైన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకూ రూ. 110, అంత కంటే ఎక్కువ ఉంటే రూ. 125 చొప్పున చెల్లించాల్సి వుంది.
బోర్డు ఖరారు చేసిన ఫీజులకు విరుద్ధంగా పలు పాఠశాలలు ఒక్కో విద్యార్థి నుంచి రూ. వెయ్యికి పైగా వసూలు చేస్తున్నాయి. ఇదేమిటనిఅడిగితే బోర్డు నిర్ధేశించిన ఫీజుతో తమకు సంబంధం లేదని, తాము అడిగిన ఫీజు చెల్లిస్తేనే హాల్ టిక్కెట్ వస్తుందని చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లిస్తున్నారు.
నవంబర్ 5వ తేదీ వరకూ గడువు పొడిగింపు
పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా నవంబర్ 5వ తేదీ వరకూ గడువు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
రూ. 50 అపరాధ రుసుంతో నవంబర్ 20వ తేదీ, రూ. 200తో డిసెంబర్ 2వ తేదీ, రూ. 500 ఫైన్‌తో డిసెంబర్ 10వ తేదీ వరకూ తుది గడువు కల్పించింది.
అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు...
మా అమ్మాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువు తోంది. పరీక్ష ఫీజు కింద రూ.125 వసూలు చేయాల్సి ఉండగా, రూ. 325 వసూలు చేశారు. అయితే తూర్పు నియోజవర్గ పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న మా అన్నయ్య కుమారుడు నుంచి పరీక్ష ఫీజు కింద రూ. 1200 వసూలు చేశారు. పాఠశాలల దోపిడీపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలి.
- ఓ విద్యార్థిని తండ్రి, గుంటూరు
ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూ లు చేస్తున్న పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి కఠిన చర్యలు చేపడతాం. రెగ్యులర్ విద్యార్థులు రూ. 125, ప్రైవేటు విద్యార్థులు రూ. 775 చెల్లించాలి. ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ధేశించిన దానికి విరుద్ధంగా అధిక ఫీజులు డిమాండ్ చేసిన పక్షంలో పాఠశాలలపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం. - దొంతు ఆంజనేయులు, డీఈవో