
తాలింపు సిద్ధం.. ఇక వడ్డనే!
- రూ. 500 కోట్ల మేర పెంచేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయం
- పలు శాఖల్లో ఉన్న యూజర్ చార్జీలు, జరిమానాల సవరింపు
- 27 శాఖల పరిధిలో అమలుకు యోచన
- ఏయే ఫీజులు, చార్జీలు ఎంత మేర పెంచాలో నిర్ణయించే బాధ్యత శాఖలకే..
- వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సీఎస్
మెనూ
డ్రైవింగ్ లెసైన్స్ ఫీజు, మార్కెట్ ఫీజు, పరీక్ష, ట్యూషన్ ఫీజు
ఆడిట్ ఫీజు, ఆర్బిట్రేషన్, ఎక్స్‌క్యూషన్, లిక్విడేషన్ ఫీజులు
విద్యుత్, పబ్లిక్ వర్క్స్, పట్టణాభివృద్ధి, నీటి సరఫరా విభాగాల్లో యూజర్ చార్జీలు
మీ సేవ, ఈ సేవ తదితర ఆన్‌లైన్ సేవల చార్జీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై రూ.500 కోట్ల బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. వివిధ శాఖల్లో అమల్లో ఉన్న యూజర్ చార్జీలు, జరిమానాలు, పన్నులు, ఫీజులన్నింటినీ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏ ఫీజును పెంచాలి, ఎంతమేరకు పెంచవచ్చనే దానిపై ప్రతిపాదనలు సమర్పించాలని అన్ని శాఖలను ఆదేశించింది. మొత్తంగా 27 శాఖల పరిధిలో ఉన్న చార్జీలు, ఫీజులను సవరించనుంది.
భారీ లక్ష్యం: గత ఏడాది వివిధ శాఖల పరిధిలో యూజర్ చార్జీలు, జరిమానాలు, పన్నులు, ఫీజుల ద్వారా రూ.1,058 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. వీటి ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్లు వచ్చే అవకాశముందని బడ్జెట్ అంచనాల్లో పొందుపరిచారు. కానీ వివిధ మార్గాల్లో ఆశించినంత ఆదాయం సమకూరకపోతుండటంతో పన్నుల భారం పెంపునకు సర్కారు మొగ్గు చూపుతోంది. తద్వారా ఈ ఏడాది రూ.1,700 కోట్ల మేరకు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ అంశంపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పన్నులు, ఫీజులన్నీ సవరించాలని.. దీనికి సంబంధించి వారం రోజుల్లో నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం సర్వీస్ ట్యాక్స్‌పై కృషి కల్యాణ్ సెస్‌ను విధించడంతో రాష్ట్రంలో ఆదాయం తెచ్చి పెట్టే అన్ని విభాగాలపై భారం పడుతోందని.. దానికి అనుగుణంగా పన్నుల పెంపు ఉండాలని సూచించారు. వేటిని సవరించాలి.. ఏ ఫీజును, ఏ పన్నును ఎంత మేరకు పెంచాలనేది సంబంధిత శాఖలే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
27 శాఖల పరిధిలో..
డ్రైవింగ్ లెర్నింగ్ లెసైన్సు ఫీజు మొదలుకుని మార్కెట్ ఫీజు, పరీక్ష ఫీజు, ట్యూషన్ ఫీజు, లెసైన్స్ ఫీజు, ఆడిట్ ఫీజు, ఆర్బిట్రేషన్, ఎక్స్‌క్యూషన్, లిక్విడేషన్ తదితర ఫీజులతో పాటు జరిమానాలన్నింటినీ పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు విద్యుత్, పబ్లిక్ వర్క్స్, పట్టణాభివృద్ధి, నీటి సరఫరా విభాగాల్లో అమల్లో ఉన్న యూజర్ చార్జీలు, ఈ సేవ, మీ సేవ తదితర ఆన్‌లైన్ సేవల చార్జీలు, పశు సంవర్థక, పౌర సరఫరాలు, సహకార శాఖలు సహా 27 శాఖల పరిధిలో ఉన్న పన్నులన్నింటినీ సవరించనున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పా టైనప్పటి నుంచి పన్నుల సవరణ జరగలేదు.
అన్ని శాఖల్లోనూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్దేశించిన చార్జీలే అమల్లో ఉన్నాయి. అందువల్ల వాటిని సమీక్షించి, కొత్త రేట్లను ఖరారు చేయాలని సీఎస్ అన్ని శాఖలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రభుత్వ ఖజానాకు ట్యాక్స్ రెవెన్యూ పద్దు కింద యూజర్ చార్జీల రూపంలో రూ.462 కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ పద్దు కింద పన్నులు, జరిమానాల రూపంలో రూ.738 కోట్లు... మొత్తంగా రూ.1,200 కోట్లు ఆదాయం వస్తుందని ఇటీవలి బడ్జెట్‌లో అంచనా వేశారు. తాజాగా పెంపుతో మరో రూ.500 కోట్లు అదనంగా రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వాస్తవంగా రూ.300 కోట్ల వరకైనా ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది.
మద్యంపై సర్వీసు ట్యాక్స్ పట్ల మల్లగుల్లాలు
కేంద్ర ప్రభుత్వం సేవల పన్ను (సర్వీస్ ట్యాక్స్)ను సవరించిన ప్రభావం ఆదా యం తెచ్చి పెట్టే శాఖలన్నింటిపై పడుతోంది. ఎక్సైజ్ శాఖలో సర్వీసు ట్యాక్స్ వడ్డింపుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. సర్వీసు ట్యాక్స్ పెంపు నుంచి తమను మినహాయించాలని టీఎస్‌బీసీఎల్ పట్టుబడుతోంది. మద్యం ధరల గరిష్ట అమ్మకపు ధర (ఎమ్మార్పీ)ను ప్రభుత్వం నిర్ణయించినందున.. సర్వీసు ట్యాక్స్ పెంచితే మద్యం ఎమ్మార్పీని పెంచాల్సి వస్తుందనే వాదనను ముందుకు తెచ్చింది. అలా చేస్తే జనంపై నేరుగా భారం పడుతుందనే కోణంలో ప్రభుత్వం ట్యాక్స్‌పై పునరాలోచన చేస్తోంది. ఈ పన్ను భారం మద్యంపై పడకుండా చూడాలని సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అసలు ఆ పన్నుకు చిక్కకుండా తప్పించుకునే ప్రత్యామ్నాయ మార్గాలపైనా చర్చించినట్లు తెలిసింది.
ఫీజులు, పన్నులు, యూజర్ చార్జీల పద్దు (రూ.కోట్లలో)
2014-15 911
2015-16 1,058
2016-17 1,200 (బడ్జెట్ అంచనా)
తాజా పెంపుతో 1,700 (కొత్త లక్ష్యం)