- 31 మండలాలకుఇన్‌చార్జ్ ఎంఈవోలు
- ఒక ఉప విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీ
- ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షలు
- ఉత్తీర్ణతపై ప్రభావం పడుతుందని ఆందోళన
యలమంచిలి : జిల్లా విద్యావ్యవస్థలో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. శాశ్వత మండల విద్యాశాఖాధికారుల నియామకాలు పదేళ్లుగా జరకపోవడం, సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడం, ఉన్నత పాఠశాలల్లోనూ ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులను నియమించి బోధన సాగించడం, తదితరాల ప్రభావం పదోతరగతి పరీక్షా ఫలితాలపై పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని ఎనిమిది మండలాలకే శాశ్వత ఎంఈవోలు ఉన్నారు. 31 మండలాలకు ఎంఈవోలుగా ఆయా మండలాల్లోని ఉన్నత పాఠశాలల సీనియర్ ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఎంఈవోల స్థానాల్లో పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులుగా నియమించారు. దాంతో ఎంఈవోలుగా ఉంటూనే తమ పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సిన రావడంతో ఒత్తిడికి గురవుతున్నామని పలువురు ఇన్‌చార్జ్ విద్యాశాఖాధికారులు అంటున్నారు.
దీంతో పాటు పాడేరు, జిల్లా పరిషత్, రాజీవ్ విద్యామిషన్ ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. పాడేరు ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు విశాఖపట్నం ఉప విద్యాశాఖాధికారిణి రేణుక, రాజీవ్ విద్యామిషన్ ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి చూస్తున్నారు. దీంతో వీరిపై పని ఒత్తిడి పెరగడంతో పాఠశాలలపై పర్యవేక్షణ లోపిస్తోంది. మరోవైపు ఉన్నత పాఠశాలల్లో పాఠ్యాంశాలు పూర్తికాక ఉపాధ్యాయుల్లో సమన్వయం లేక బోధన మూలకు చేరిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నివేదికలతోనే సరి...
మండలాల్లో ఇన్‌చార్జ్ ఎంఈవోలుగా పనిచేస్తూ పాఠశాలల పనితీరు, మధ్యాహ్న భోజనం పరిశీలన, పారదర్శక నిధులు వినియోగం, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన ఎస్‌ఎంసీల సమావేశాలు నిర్వహణ, విధులపై వారికి అవగాహన కల్పించడంలోనే సతమతమవుతుంటే.. ఉన్నతాధికారులు వివిధ నివేదికలు అందజేయాలంటూ వారానికి రెండుమూడుసార్లు సమావేశాలకు హాజరు కావాలంటూ జిల్లా కేంద్రానికి పిలిపించుకుంటుండటంతో పాఠశాలల పర్యవేక్షణ అటకెక్కిందని ఎంఈవోలు చెబుతున్నారు.
పాఠశాల ఆవాస ప్రణాళికలు, పాఠశాల వార్షిక అభివృద్ధి నివేదికలు, ఆధార్, 2005 నుంచి 2014 వరకూ మధ్యాహ్న భోజన ఖర్చుల నివేదిక, ఏకరూప దుస్తుల వివరాల నివేదికలు, జమ, వ్యయాలు సరిపోక తజ్జనభజ్జన పడుతున్నామని అంటున్నారు. అధికారాలు లేని ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుల మాటను సిబ్బంది వినిపించుకోని పరిస్థితి కొన్నిచోట్ల ఉంది. పదో తరగతి పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు తగు పర్యవేక్షణ లేకపోవడంతో తమకెందుకులే అన్నట్టు వారంతా మిన్నకుండిపోతున్నారు.
మెరుగైన ఫలితాలు సాధ్యమేనా?
గత మూడేళ్లలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 17, 14, 11 స్థానాల్లో ఉంది. ఈ ఏడాది దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారా ? చేతులెత్తేస్తారా? అన్న సందేశం విద్యాశాఖ ఉన్నతాధికారులనే కలవరపెడుతోంది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్ మారడం, దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం, మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలు సమకూర్చకపోవడం తదితరాలతో తరగతి గదుల్లో బోధన నత్తనడకన సాగింది. కొన్ని నాన్‌పేనల్ హైస్కూళ్లలో కొన్ని సబ్జెక్టులకు ఏడాది పొడవునా ఉపాధ్యాయులే లేరు
31 మండలాలకు ఇన్‌చార్జ్ ఎంఈవోలు
జిల్లాలో 31 మండలాలకు ఇన్‌చార్జ్ ఎం ఈవోలు ఉన్నారు. 8 మండలాలకు మాత్రమే శాశ్వత ఎంఈవోలు బాధ్యతలు చూస్తున్నారు. దీనివలన పాఠశాలల పర్యవేక్షణ కొంత వరకు ఇబ్బందే. అయినప్పటికీ పదో తరగతి ఫలితాలపై ఆ ప్రభావం లేకుండా చూస్తున్నాం. ప్రత్యే క పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం.
- ఎం.వెంకటకృష్ణారెడ్డి, డీఈవో