
మంగళగిరిలో ఉద్రిక్తత..
మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న కాపు సోదరులను పోలీసులు అడ్డుకున్నారు.
కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేయడానికి యత్నించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల తీరును నిరసిస్తూ.. ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.