తిరుమలలో ఉద్రిక్తత
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. కొత్త ప్రాజెక్టు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ నాలుగు మాడవీధుల్లో అఖండ హరినామ సంకీర్తన చేయాలని భజన బృందాలు తిరుమలకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంతంలో నిషేధిత కార్యక్రమాలు చేపట్టకూడదని విజిలెన్స్ అధికారులు మాడవీధుల్లోని గేట్లను మూసివేసి వారిని వెనక్కు పంపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. భజన కార్యక్రమాలకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చి, జానపద కళాకారులను ఆదుకోవాలని కొంతకాలంగా భజన బృందాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అదే డిమాండ్‌తో ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో తెలుగు భజన బృందాలు సుమారు 11 వేల మంది అలిపిరి కాలిబాటలో మెట్లోత్సవం నిర్వహించారు.
తర్వాత ఆలయ నాలుగు మాడవీధుల్లో అఖండ హరినామ సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఆలయం ఎదురుగా ఆస్థాన మండపం వద్దకు తరలివచ్చారు. ఆందోళన కార్యక్రమాలు మాడవీధుల్లో నిర్వహించరాదన్న నిబంధన ఉంది. దాంతో ఆలయ విజిలెన్స్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న టీటీడీ జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు భజన బృందాల నేతలతో చర్చించారు. హరినామ సంకీర్తనకు ముళ్లగుంత స్థలాన్ని కేటాయించామన్నారు. దీంతో కళాకారులు అక్కడకు వెళ్లి హరినామ సంకీర్తన నిర్వహించారు.
రేపు ఉదయం 6 గంటల నుంచి దర్శనం నిలిపివేత
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం శ్రీవారి ఆల యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు అన్ని రకాల దర్శనాలు నిలిపివేస్తారు. తర్వాత ఆలయాన్ని శుద్ధిచేసి ఉదయం 11 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తారు.