పాత విధానంలో పరీక్షలు | Tenth class Examinations in Old system | Sakshi
Sakshi News home page

పాత విధానంలో పరీక్షలు

Published Fri, Aug 1 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM

పాత విధానంలో పరీక్షలు

పాత విధానంలో పరీక్షలు

 విజయనగరం అర్బన్ : పదో తరగతి పరీక్షల విధానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనర్ ఉషారాణిఆదేశాలు జారీచేశారు. గురువారం సాయంత్రం నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆమె ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. హిందీ పరీక్షకు 35 మార్కుల ఉత్తీర్ణత అర్హతను పెంచుతూ మిగిలిన పరీక్షలన్నీ పాత పద్ధతిలోనే ఈ ఏడాదికి నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో కొన్ని రోజు లుగా పదో తరగతి పరీక్షల విధానంపై నెలకొన్నసందిగ్ధం వీడింది.
 
 విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు పూర్తయినా ఇంతవరకూ 9, 10 వ తరగతుల విద్యార్థులకు ఇంతవరకు ఫార్మేటివ్-1 (యూనిట్) పరీక్షలు నిర్వహించలేదు. పాత పద్ధతిలో పరీక్షలు జరపాలా? కొత్త విధానంలో నిర్వహించాలా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.   ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్ పూర్తిగా మారింది. నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) పద్ధతిలో పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. దీని ప్రకారం టెన్త్ విద్యార్థులకు ఫార్మేటివ్ (యూనిట్ టెస్ట్‌లు), సమ్మేటివ్-1(క్వార్టియర్లీ), -2(అర్ధ సంవ త్సర), -3(సంవత్సరాంత) పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలి. ఇందులో గతంలో లాగా 11 పేపర్లు కాకుండా 9 పేపర్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడీ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తారు.
 
 తొమ్మిదిలో కొత్తది.. పదికి వచ్చిన ఆ విద్యార్థులకు  పాత పరీక్ష
 గత ఏడాది నూతన సిలబస్ పాఠ్యపుస్తకాలు వచ్చిన 9వ తరగతి విద్యార్థులకు తొలిసారిగా నూతన పద్ధతిలోనే ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది పదోతరగతికి వచ్చిన ఆ బ్యాచ్ విద్యార్థులకు నూతన పద్ధతిలో పరీక్షలు జరిపించాలని కొందరి అభిప్రాయం. అయితే తాజా నిర్ణయం మేరకు 10వ తరగతి విద్యార్థులకు 8వ తరగతిలో రాసిన విధంగానే పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు.  దీంతో పాఠ్యపుస్తకాల కొత్త సిలబస్‌తో పాత పద్ధతిలో పరీక్షలు జరపాలనే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 పరీక్షలు ఆలస్యం
 సాధారణంగా అన్ని తరగతులకు ఫార్మేటివ్-1 పరీక్షలు జూలై 31లోపు నిర్వహిస్తారు. ఈ మేరకు జిల్లా పరీక్షల నిర్వహణ మండలి (డీసీఈబీ) నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ పరీక్షలకు ఉపాధ్యాయులే ప్రశ్నపత్రాలు తయారు చేసుకుంటారు. అయితే కొత్త పాఠ్యపుస్తకాలు కావడంతో ప్రశ్నపత్రాల మోడల్స్‌ను ఉన్నతాధికారులు ఇవ్వాల్సి ఉంది. ప్రశ్నపత్రాల మోడల్స్ ఎప్పుడిస్తారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల  ఇప్పట్లో పరీక్షలు జరిగే అవకాశం కనిపించడంలేదు. మరో వైపు బడిపిలుస్తోంది, ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షలు 15 రోజుల లోపు ప్రారంభించే అవకాశం కనిపించడం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే జరగాల్సిన 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఫార్మేటివ్-1 పరీక్షలు కూడా జరగలేదు. ఈ పరీక్షలపై రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంతవరకూ పరీక్షా పత్రాల తయారీగాని, పరీక్షల షెడ్యూల్‌గాని ప్రకటించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement