Old system
-
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్‌లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
హెచ్1–బి వీసాలకు మళ్లీ ‘లాటరీ’యే
వాషింగ్టన్: వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్1–బి వీసాల కేటాయింపును పాత పద్దతిలో ‘లాటరీ’ విధానంలోనే కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్1– బి వీసాలను (నిర్ణీత కోటా 65 వేలు,, అమెరికా వర్శిటీల్లో పీజీ.. ఆపై కోర్సులు చేసిన వారికి అదనంగా 20 వేల హెచ్1–బి వీసాలు) జారీ చేస్తోంది. టెక్ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్1–బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే... లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందిన విషయం గమనార్హం. అత్యంత ప్రతిభావంతులనైన వృత్తి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాటరీ పద్దతికి స్వస్తి పలికి ఈ ఏడాది జనవరి 8న కొత్త విధానాన్ని తెచ్చింది. వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే ప్రాధాన్యత క్రమంలో మొదట వీసాలు దక్కుతాయి. ఈ ఏడాది మార్చి 9 నుంచి దీన్ని అమలు చేయాలని భావించినా... అది ఆలస్యమైంది. మరోవైపు సెప్టెంబరులో వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ సర్కారు నిర్ణయించింది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీచేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది. -
ఈ ఏడాది పాత పద్ధతిలోనే నీట్ ఎస్ఎస్ పరీక్షలు
న్యూఢిల్లీ: వైద్య విద్యలో స్పెషలైజేషన్ కోర్సుల కోసం ఉద్దేశించిన నీట్ సూపర్ స్పెషాలటీ పరీక్షలు ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే జరుగుతాయని సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 2022–23 విద్యా సంవత్సరం నుంచి మార్పుల్ని అమలు చేస్తామని వెల్లడించింది. కేంద్ర నిర్ణయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి బుధవారం సుప్రీం బెంచ్‌కి తెలిపారు. ‘పాత విధానంలో పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ మెడికల్ కమిషన్, జాతీయ పరీక్షల బోర్డుతో సంప్రదించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది’ అని ఆమె తెలిపారు. నవంబర్ 13–14 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షల్ని వాయిదా వేసే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ఈ ఏడాది నుంచే నీట్ పరీక్షలో మార్పులుంటాయని నోటిఫికేషన్ వెలువడ్డాక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 41 మంది పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు, ఇతర వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టుకెక్కడంతో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం వారి పిటిషన్లు విచారించింది. కేంద్రం తీరుపై సుప్రీం బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరీక్షకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సిలబస్ మార్చడం ఏమిటని కేంద్రాన్ని నిలదీసింది. -
పాత విధానంలో పరీక్షలు
విజయనగరం అర్బన్ : పదో తరగతి పరీక్షల విధానంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనర్ ఉషారాణిఆదేశాలు జారీచేశారు. గురువారం సాయంత్రం నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆమె ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. హిందీ పరీక్షకు 35 మార్కుల ఉత్తీర్ణత అర్హతను పెంచుతూ మిగిలిన పరీక్షలన్నీ పాత పద్ధతిలోనే ఈ ఏడాదికి నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో కొన్ని రోజు లుగా పదో తరగతి పరీక్షల విధానంపై నెలకొన్నసందిగ్ధం వీడింది. విద్యా సంవత్సరం ప్రారంభమై 40 రోజులు పూర్తయినా ఇంతవరకూ 9, 10 వ తరగతుల విద్యార్థులకు ఇంతవరకు ఫార్మేటివ్-1 (యూనిట్) పరీక్షలు నిర్వహించలేదు. పాత పద్ధతిలో పరీక్షలు జరపాలా? కొత్త విధానంలో నిర్వహించాలా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి సిలబస్ పూర్తిగా మారింది. నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) పద్ధతిలో పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. దీని ప్రకారం టెన్త్ విద్యార్థులకు ఫార్మేటివ్ (యూనిట్ టెస్ట్‌లు), సమ్మేటివ్-1(క్వార్టియర్లీ), -2(అర్ధ సంవ త్సర), -3(సంవత్సరాంత) పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలి. ఇందులో గతంలో లాగా 11 పేపర్లు కాకుండా 9 పేపర్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడీ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తారు. తొమ్మిదిలో కొత్తది.. పదికి వచ్చిన ఆ విద్యార్థులకు పాత పరీక్ష గత ఏడాది నూతన సిలబస్ పాఠ్యపుస్తకాలు వచ్చిన 9వ తరగతి విద్యార్థులకు తొలిసారిగా నూతన పద్ధతిలోనే ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది పదోతరగతికి వచ్చిన ఆ బ్యాచ్ విద్యార్థులకు నూతన పద్ధతిలో పరీక్షలు జరిపించాలని కొందరి అభిప్రాయం. అయితే తాజా నిర్ణయం మేరకు 10వ తరగతి విద్యార్థులకు 8వ తరగతిలో రాసిన విధంగానే పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో పాఠ్యపుస్తకాల కొత్త సిలబస్‌తో పాత పద్ధతిలో పరీక్షలు జరపాలనే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు ఆలస్యం సాధారణంగా అన్ని తరగతులకు ఫార్మేటివ్-1 పరీక్షలు జూలై 31లోపు నిర్వహిస్తారు. ఈ మేరకు జిల్లా పరీక్షల నిర్వహణ మండలి (డీసీఈబీ) నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ పరీక్షలకు ఉపాధ్యాయులే ప్రశ్నపత్రాలు తయారు చేసుకుంటారు. అయితే కొత్త పాఠ్యపుస్తకాలు కావడంతో ప్రశ్నపత్రాల మోడల్స్‌ను ఉన్నతాధికారులు ఇవ్వాల్సి ఉంది. ప్రశ్నపత్రాల మోడల్స్ ఎప్పుడిస్తారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఇప్పట్లో పరీక్షలు జరిగే అవకాశం కనిపించడంలేదు. మరో వైపు బడిపిలుస్తోంది, ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పరీక్షలు 15 రోజుల లోపు ప్రారంభించే అవకాశం కనిపించడం లేదని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు ఇప్పటికే జరగాల్సిన 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఫార్మేటివ్-1 పరీక్షలు కూడా జరగలేదు. ఈ పరీక్షలపై రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇంతవరకూ పరీక్షా పత్రాల తయారీగాని, పరీక్షల షెడ్యూల్గాని ప్రకటించలేదు.