=వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బీసీసీఐ ప్రతినిధి బృందం
=స్టేడియం వసతుల పట్ల సంతృప్తి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఇప్పటికే అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చిన స్టేడియంలో త్వరలోనే టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చిన ఈ స్టేడియాన్ని గతంలోనే ఐసీసీ ప్రతినిధి బృందం పరిశీలించి కొన్ని మార్పులు చేర్పులు చేసింది.
వాటికి అనుగుణంగా ఏసీఏ అన్ని హంగుల్ని సమకూర్చుకున్నా ఇప్పటికీ టెస్ట్ హోదా అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీసీసీఐ ప్రతినిధి బృందం గురువారం విశాఖ చేరుకుని స్టేడియం పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో బీసీసీఐ నుంచి పచ్చజెండా రానుంది. పర్యవేక్షక కమిటీకి రంజిత్ బిస్వాల్ అధ్యక్షత వహించగా బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్ ఎం.వి. శ్రీధర్, మాజీ టెస్ట్ ఆటగాడు జి.ఆర్.విశ్వనాథ్, బీసీసీఐ టీవీ డెరైక్టర్ జేమ్స్ రెగో తదితర కమిటీ సభ్యులు వైఎస్‌ఆర్ స్డేడియాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఏసీఏ ప్రతినిధులు డి.వి.సుబ్బారావు, డి.వి.సోమయాజులు, జి.రంగరాజు, జి.జె.జె.రాజు, అరుణ్‌కుమార్, ఎం.ఎస్.కె.ప్రసాద్, బి.జె.జె.రాజు, సి.ఆర్.మోహన్ పాల్గొన్నారు.
తొలిటెస్ట్ బంగ్లాదేశ్‌తో...?
ప్రస్తుత 2014 సీజన్ అంతా విదేశాల్లో భారత్ జట్టు గడపనుంది. సీజన్ అనంతరం భారత పర్యటనకు బంగ్లాదేశ్ జట్టు రానుండడంతో సిరీస్‌లో ఓ టెస్ట్ మ్యాచ్ విశాఖలో నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రతిరాష్ట్రంలోనూ అంతర్జాతీయ స్టేడియాల రూపకల్పన , మ్యాచ్‌ల నిర్వహణ జరుగుతుండడంతో విశాఖ స్టేడియానికి టెస్ట్ హోదా వచ్చేందుకు సమయం తీసుకుంది. అయితే రొటేషన్ పద్ధతిలోనూ మ్యాచ్‌ల కేటాయింపు ఉంది.
టెస్ట్ హోదా ఇవ్వాలని నివేదిస్తాం
బీసీసీఐ నిర్దేశించిన అన్ని అర్హతల్ని వైఎస్‌ఆర్ స్టేడియం కలిగి ఉందని పర్యవేక్షక బృందానికి అధ్యక్షత వహించిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చైర్మన్, బీసీసీఐ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ రంజిత్ బిస్వాల్ తెలిపారు. గురువారం కమిటీ ప్రతినిధులు స్టేడియంలోని అన్ని వసతుల్ని పర్యవేక్షించారు. అన్ని విషయాలను నోట్ చేసుకున్నామని వాటిని రిపోర్ట్‌లో పొందుపరిచి విశాఖ స్టేడియానికి టెస్ట్ హోదా కల్పించాలని బీసీసీఐకి నివేదిస్తామని అన్నారు.
విశాఖ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు తగిన వసతులను కలిగి వుందన్నారు. అందువల్ల వచ్చే ఏడో ఐపీఎల్ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే గవర్నింగ్ బాడీ ఎన్నికలు ఉన్నాయన్నారు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 60 మ్యాచ్‌లుంటాయన్నారు.