టెక్స్‌టైల్స్‌ పార్క్‌ కలేనా? | textiles park is dream project in nellore district | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్స్‌ పార్క్‌ కలేనా?

Published Mon, May 1 2017 11:47 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

టెక్స్‌టైల్స్‌ పార్క్‌ కలేనా? - Sakshi

టెక్స్‌టైల్స్‌ పార్క్‌ కలేనా?

► దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో ప్రతిపాదన
► ఆయన మరణంతో అటకెక్కిన వైనం

జిల్లాలో వస్త్ర వ్యాపార కేంద్రంగా భాసిల్లుతున్న కావలిలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటు కలగా మారింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించిన టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు సంబంధించి ప్రాథమిక అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఆయన అకాల మరణంతో ఈ ప్రాజెక్ట్‌ మరుగునపడింది. ఏటా వందల కోట్ల రూపాయల వస్త్ర వ్యాపారం సాగుతున్న కావలిలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తే జిల్లా అభివృద్ధి రూపురేఖలు మారే అవకాశాలు ఉన్నాయి.

కావలి : తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులకు కావలి నుంచి హోల్‌సేల్‌ ధరలకు వస్త్రాలు సరఫరా సాగుతోంది. సుమారు 70 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావలి వస్త్ర వ్యాపార కేంద్రంగా ఉంది. నాలుగు వస్త్ర మార్కెట్లతో 450 హోల్‌సేల్, రిటైల్‌ దుకాణాలు కావలిలో ఉండటం గమనార్హం. ఏడాదికి ఇక్కడ రూ.750 కోట్ల వస్త్ర వ్యాపారం జరుగుతోంది.

వస్త్ర వ్యాపారంలో ఇంతటి ప్రాధాన్యం ఉన్న కావలిలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అప్పట్లో స్థానిక వస్త్ర వ్యాపారులు కోరారు. ఆయన మరణించడం, తర్వాత స్థానిక వస్త్ర వ్యాపారులు దీని గురించి కొందరు శ్రద్ధ చూపినా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో  ఈ ప్రతిపాదన అటకెక్కింది.

కావలి ప్రత్యేకత ఏమిటంటే..
కావలికి చెందిన వస్త్ర వ్యాపారులు ముంబయి, సూరత్, అహమ్మదాబాద్, జెట్‌పూర్‌ (రాజస్థాన్‌), కాశీ, కోల్‌కతా, ఈ రోడ్డు, కోయంబత్తూర్, తిరుపూర్‌ తదితర చోట్ల నుంచి వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న వస్త్ర పరిశ్రమల వద్దకు వెళ్లి ఒకేసారి భారీ ఎత్తున ఒకే రకం వస్త్రాలను కొనుగోలు చేస్తారు. దీంతో ఒకే రకమైన వస్త్రాలను భారీగా కొనుగోలు చేయడంతో పరిశ్రమల వారు చాలా తక్కువ ధరకే వ్యాపారులకు ఇస్తుం టారు.

దీంతో కావలి వస్త్ర వ్యాపారులు వాటిని కొంత మార్జిన్‌ పెట్టుకుని హోల్‌సేల్, రిటైల్‌ అమ్మకాలు చేయడంతో మార్కెట్‌లో తక్కువ ధరలకే అమ్మకాలు చేస్తారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది వస్త్ర దుఖాణదారులు, ఇళ్ల వద్ద అమ్మకాలు చేసే వారు కావలి నుంచి వస్త్రాలు తీసుకెళ్లి వ్యాపారం చేసుకుంటారు.

ఐదు వేల మందికి ఉపాధి
1955 సంవత్సరం నుంచి కావలిలో జరగుతున్న ఈ వస్త్ర వ్యాపారంపై ప్రస్తుతానికి ఐదు వేలమందకి పై చిలుక గుమస్తాలుగా, ముఠా కూలీలుగా, ఎంబ్రాయిడరీ, పాల్సు, పెట్టీ కోట్స్‌ పనులు చేసేవారుగా జీవనోపాధి పొందుతున్నారు. కాగా ఇటీవల వస్త్రాలతో రెడీమేడ్‌ గార్మెట్స్‌ తయారు చేసే సంస్థలు పది వరకు వెలిశాయి. ఈ రెడీమేడ్‌ గార్మెట్స్‌ డ్రెస్సులను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వస్త్ర వ్యాపారులు ఇక్కడి నుంచి తీసుకెళుతుంటారు.

చదువులకు పెద్దగా ప్రాధాన్యంలేని రోజుల్లో కావలిలో మొదలైన వస్త్ర వ్యాపారం రంగంలో రెండు తరాలు పూర్తిగా గడిచిపోయింది. వేరే ఉపా«ధి అవకాశాలు లేక పోవడంతో వస్త్ర వ్యాపారంపైనే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు మూడో తరం మొదలైంది. వీరిలో ఉన్నత చదువులు చదవడంతో పాటు, పాత మూసలో కాకుండా వ్యాపారంలో తమ ప్రతిభను ప్రదర్శించాలనే పట్టుదల కూడా పెరిగింది.

వస్త్ర పారిశ్రామికీకరణ దిశగా
వస్త్ర వ్యాపారం నుంచి వస్త్ర పరిశ్రమను స్థాపించాలని నేటి తరం వారు ఆలోచనలు మొదలు పెట్టారు. ఎక్కడో తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి అమ్మకాలు చేయడం కన్నా, స్థానికంగానే వస్త్రాలను తయారు చేయాలనే పట్టుదల పెరిగింది.  అందులో భాగంగానే డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్త్ర పరిశ్రమల సముదాయంతో కూడిన టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను కావలిలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను స్థానిక వస్త్ర వ్యాపారులు ఆయనను కలిసి చెప్పారు.

అందుకు వైఎస్సార్‌ కూడా సుముఖత వ్యక్తం చేసి దానిపై పూర్తి వివరాలతో మాట్లాడుకుందామని స్థానిక వ్యాపారులకు తెలిపారు. అంతలో ఆయన మరణించడంతో ఆ విషయం అటకెక్కింది.

వస్త్ర వ్యాపారులు ఏమి కోరుకుంటున్నారంటే..
కావలి పట్టణానికి పడమర వైపున ఉదయగిరి రోడ్డులో అటవీ శాఖ భూమి ఉంది. దానిని డీఫారెస్ట్‌ చేసి అందులో కనీసం 200 ఎకరాలు టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు కేటాయిం చి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రకటించి, అందులో ఎస్సీ,ఎస్టీ, మహిళలు ఆసక్తి కనపరిచేలా విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తే కావలికి మహర్దశ పట్టినట్లే. దేశం నలుమూలకు వెళ్లి కొనుగోలు చేసే వస్త్రాలను స్థానికంగానే తయారు చేసే వెసులుబాటు కలుగుతోంది.

చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది
కావలిలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని వనరులు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల అనుమతులు వస్తేనే ఈ పరిశ్రమ కు అవసరమైన ప్రోత్సాహకాలు అందుతాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం లేదు. కావలిలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఆవశ్యకతపై రాష్ట్ర ఉన్నత స్థాయి వర్గాలకు పలుమార్లు చెప్పినా వారు పెడచెవిన పెడుతున్నారు. –కందుకూరి వెంకట సత్యనారాయణ, చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, గ్రూప్‌ ఆఫ్‌ కందుకూరి

ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి
కావలిలో టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తే విద్యావంతులైన యువతీయువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. ఇతర రాష్ట్రాల్లో చెల్లిస్తున్న వివిధ రకాల పన్నులు మన రాష్ట్ర ఖజానాకే జమ అవుతాయి.  –తన్నీరు మాల్యాద్రి, జిల్లా కన్వీనర్, ఏపీ టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement