బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్‌సీ’ కార్యాలయం! | TFC Office At Bala Krishna House Itself | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ఇంట్లోనే ‘టీఎఫ్‌సీ’ కార్యాలయం!

Published Thu, Apr 4 2019 5:36 AM | Last Updated on Thu, Apr 4 2019 5:36 AM

TFC Office At Bala Krishna House Itself - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం పేరుతో మంగళవారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన టీడీపీ అనుకూల ఏపీ ఎన్నికల సర్వేకు సంబంధించిన కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఆ విభాగం అధికారులు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ బోగస్‌ సర్వేను యూట్యూబ్‌లో పెట్టిన టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయం జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 36లోని ఎన్‌బీకే (నందమూరి బాలకృష్ణ) భవన్‌లో కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వియ్యంకుడు బాలకృష్ణ తన భవనంలోనే టీఎఫ్‌సీకి ఆశ్రయం ఇచ్చారని పోలీసు విచారణలో తేలడంతో ఇదంతా టీడీపీ అగ్రనేతల డైరెక్షన్‌లోనే సాగిందని స్పష్టమవుతోంది. హైదరాబాద్‌ నుంచే ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు సాగుతున్నాయంటూ ఓ వైపు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు.. అదే హైదరాబాద్‌ నుంచి వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తారాస్థాయికి తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. 

విజయవాడలోనే నిందితులు.. 
కాగా, టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు శాఖమూరి తేజోభాను, ప్రియదర్శిని, రామకృష్ణ వీరపనేని, ఏదుగాని మల్లేష్, చీపురుపల్లి రాంబాబులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 420, 417, 465, 468, 471, 505 (1సీ), 505 (2), 171 (సీ) రెడ్‌విత్‌ 171 (ఎఫ్‌), 171 (జీ), 120 (బి), సెక్షన్‌ 66 (డి) ఆఫ్‌ ఐటీ యాక్ట్‌–2000 కింద కేసులు నమోదు చేశారు. అయితే, మంగళవారం రాత్రి ఈ కార్యాలయంపై దాడులు చేయగా, ఆరు నెలల క్రితమే ఇక్కడి నుండి కార్యాలయం ఎత్తేసినట్లు అక్కడున్న సిబ్బంది పోలీసులకు చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఓ వెబ్‌చానల్‌ నడుస్తున్నట్లుగా గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీస్‌ బృందం గాలింపు చేపట్టింది. సెల్‌ సిగ్నళ్లను బట్టి వీరు విజయవాడలో ఉన్నట్లు తెలుస్తోంది. 

షర్మిలపై దుష్ట్రచారానికీ అదే వేదిక!  
బాలకృష్ణ భవనంలోనే టీఎఫ్‌సీ కార్యాలయాన్ని నడిపిన నిందితులు ఇక్కడి నుంచే వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిలపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన ‘పచ్చ గ్యాంగ్‌’ ఇదే భవనాన్ని వేదికగా మార్చుకున్నారని సమాచారం. ఇక్కడి నుంచే రకరకాల పోస్టులు తయారుచేసి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా విష ప్రచారం చేశారు. ఆరు నెలల క్రితం తమపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై షర్మిల, ఇతర పార్టీ నేతలు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరు తమ ప్రణాళికను మార్చారు. ఇక్కడ ఉంటే టీఎఫ్‌సీ కార్యకలాపాలు బయటపడి టీడీపీ డ్రామాలు వెలుగులోకొస్తాయనే ఉద్దేశంతో బాలయ్య భవన్, సాగర్‌ సొసైటీలోని కార్యాలయాలను ఖాళీచేశారు. ఐటీ గ్రిడ్స్‌ డాటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌ మాదిరిగానే ఈ కేసులోనూ ఐదుగురు నిందితులకు టీడీపీ సర్కార్‌ రక్షణ ఇస్తున్నట్టుగా తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement