- ఎస్వీయూ అధికారులుగా ఏమైనా చేసుకోవచ్చు
- మీడియా సమావేశంలో ఎస్వీయూ రిజిస్ట్రార్ సత్యవేలురెడ్డి
- వీడియో ద్వారా ప్రెస్‌మీట్ రికార్డింగ్ యత్నం
- ఎదురు తిరిగిన మీడియా ప్రతినిధులు
యూనివర్సిటీ క్యాంపస్ : పాత్రికేయులు కొంతమంది చెప్పుడు మాటలు నమ్మి తనపై అసత్య వార్తలు ప్రచురిస్తున్నారని, ఆ వార్తలను ప్రచురించిన మీడియా సంస్థలను, సమాచారం ఇచ్చిన వ్యక్తులపై కేసులు పెట్టి కోర్టుకు లాగుతానని ఎస్వీయూ రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి అన్నారు. ఎస్వీయూలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి తన భార్యకు పదవి కట్టబెట్టారనే సమచారాన్ని టీఎన్‌ఎస్‌ఎఫ్ హరికృష్ణయాదవ్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి పత్రికలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు గురువారం పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై రిజిస్ట్రార్ కె.సత్యవేలురెడ్డి శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. పత్రికల్లో అసత్యకథనాలు వస్తున్నాయన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. కొంతమంది వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీటిని పాత్రికేయులు యధాతథంగా ప్రచురిస్తున్నారని ఆరోపించారు.
యూనివర్సిటీలో పరిపాలనా పరమైన ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి వీసీకి అధికారాలు ఉన్నాయని చెప్పారు. అందువల్ల తాము తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు. తన భార్య విషయంలో తాము ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని స్పష్టం చేశారు.
వీడియో రికార్డింగ్
శుక్రవారం ఎస్వీయూ రిజిస్ట్రార్ నిర్వహించిన ప్రెస్ మీట్‌ను ఆయన ఆద్యంతం వీడియో రికార్డింగ్ చేయించారు. యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు ప్రెస్‌మీట్, ఇతర అధికారిక కార్యక్రమం నిర్వహించినా వీడియో రికార్డింగ్ చేసేవారు కాదు. అయితే పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించాలని రిజిస్ట్రార్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వీడియో రికార్డింగ్ చేయించారు. దీనిని పసిగట్టిన పాత్రికేయులు ఎదురు తిరిగారు. విలేకరుల సమావేశం పెట్టి అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇలా అయితే ప్రెస్‌మీట్‌లను బహిష్కరిస్తామని తేల్చిచెప్పడంతో చేసిన వీడియో రికార్డింగ్ తొలగించారు.
అక్రమ కేసులు బనాయించేందుకే
ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థి నాయకులపై అక్రమకేసులు బనాయించిన ఎస్వీయూ అధికారులు తాజాగా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న విలేకరులపై అక్రమ కేసులు బ నాయించడానికి ప్రయత్నిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఇది అధికారులు మీడియాను భయపెట్టి గొంతునొక్కే ప్రయత్నమేనని విమర్శించారు. దీనిపై వీసీ రాజేంద్రను విలేకరులు వివరణ కోరగా వీడియో రికార్డింగ్ చేయించమని తాను చెప్పలేదన్నారు.