
ఎల్ అండ్ టీ సంస్థ రూపొందించిన కూచిపూడ ముద్ర ఆకారంలోని డిజైన్
సాక్షి, అమరావతి: రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణలో బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకుండా, సర్కారు ‘రియల్’ వ్యాపారానికి ఎదురొడ్డి నిలిచిన రైతులపై కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమయ్యింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు అప్పగించని రాజధాని రైతుల భూములను గ్రీన్‌బెల్ట్‌గా ప్రకటించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జరిగిన సమీక్షలో సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ఆ భూముల్లో వ్యవసాయం మినహా ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం నుంచి రాజధాని వరకు 3.8 కిలోమీటర్ల మేర కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ఎల్ అండ్ టీ సంస్థ.. నమస్కార ముద్ర, కూచిపూడి నృత్య భంగిమ ముద్ర, కూచిపూడి అరల ముద్ర, పువ్వు ఆకారంలో రెండతస్తుల వారధి, అమరావతి స్థూపం, కొండపల్లి బొమ్మ ఆకారంలో డిజైన్లను చూపించింది. అయితే కూచిపూడి ముద్ర, పువ్వు డిజైన్‌ను కలిపి రెండంతస్తుల వారధికి తుదిరూపు ఇవ్వాలని బాబు ఎల్ అండ్ టీకి సూచించారు.